: మా పాలిట రక్త పిశాచి చైనా: ఓబీఓఆర్ పై బెలూచ్ ఆగ్రహం

తమ పాలిట చైనా అత్యాచారాలు చేసి రక్తం తాగే పిశాచిలా మారిందని వరల్డ్ బెలూచ్ ఉమెన్స్ ఫోరమ్ అధ్యక్షురాలు నీలా ఖ్వాద్రీ బెలూచ్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అసలు తమ ప్రాంతంలో అభివృద్ధి పేరిట చైనా ప్రాజెక్టులు చేపట్టడాన్ని ప్రశ్నించిన ఆమె, చైనా ఆగడాలకు ప్రపంచ నేతలు ఎందుకు వత్తాసు పలుకుతున్నారని ప్రశ్నించారు. బెలూచిస్థాన్ లో పాక్ సైన్యం దారుణాతి దారుణంగా ప్రవర్తిస్తుంటే ఎవరైనా స్పందించారా? అని అడిగిన నీలా ఖ్వాద్రీ, వేలాది మందిని పాక్ సైన్యం నిర్బంధించి అత్యాచార గదుల్లో ఉంచి నిత్యమూ లైంగిక దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు.

స్వాతంత్ర్యం కోసం తాము పోరాడుతున్నామని తెలిపిన ఆమె, పాక్ ఆర్మీ ఎంతో మంది బెలూచ్ న్యాయవాదులు, డాక్టర్లు, ఇంజనీర్లను కిడ్నాప్ చేసిందని ఆరోపించారు. పాక్ ఆగడాలకు చైనా మద్దతిస్తోందని, అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలన్నీ ఏమైపోయాయని ఆమె ప్రశ్నించారు. బెలూచ్ ప్రజలను హత్య చేసేందుకు, ఆడవారిపై అత్యాచారాలకు తెగబడేందుకు పాక్ ప్రభుత్వం లైసెన్సులిచ్చి మరీ సైన్యాన్ని పంపుతోందని, ఐక్యరాజ్యసమితి కూడా గుడ్డిదైపోయిందని ఆరోపించారు. తన చెవులు, నోరు మూసుకుపోయిన స్థితిలో ఉన్న ఐరాస ఇప్పటికైనా మేలుకోవాలని కోరారు. కాగా, చైనాలో ప్రారంభమైన ఓబీఓఆర్ ప్రాజెక్టు సదస్సుకు భారత్ గైర్హాజరైన సంగతి తెలిసిందే.

More Telugu News