: ధర్నా చౌక్ ఉండాల్సిందేనంటూ రంగంలోకి దిగిన జనసేన... మరింత ఉద్రిక్తత!

హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద ఈ ఉదయం నుంచి స్థానికులు, వామపక్షాల కార్యకర్తల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొనగా, ధర్నా చౌక్ ఉండాల్సిందేనని డిమాండ్ చేస్తూ, కొద్దిసేపటి క్రితం జనసేన కార్యకర్తలు, తమ జెండాలతో ఇందిరా పార్కు వద్దకు చేరుకున్నారు. వారంతా స్థానికులతో కలసి నినాదాలు చేస్తుండటంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. స్థానికులమని చెప్పుకుంటున్న వారికి మద్దతుగా టీఆర్ఎస్ నేతలు, గూండాలను పంపుతున్నారని వామపక్షాలు ఆరోపిస్తుండగా, అసలు ఈ ప్రాంతంతో ఎంతమాత్రమూ సంబంధం లేని వారు వచ్చి, తమపై గూండాగిరి చేసి దాడి చేశారని స్థానికులు ఆరోపించారు.

ఇక ధర్నా చౌక్ నగరం మధ్యలో ఉంటేనే నిరసనలు తెలిపే సామాన్యులకు ఇబ్బందులు లేకుండా ఉంటుందని తమ నేత పవన్ కల్యాణ్ ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపేందుకే వచ్చినట్టు జనసేన కార్యకర్తలు చెబుతున్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి కూడా జనసేన కార్యకర్తలు రావడం విశేషం. అసలు నిరసన కార్యక్రమం ఉదయం 11 గంటల తరువాతే ఉండటంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా అదనపు పోలీసు బలగాలను మోహరించారు.

More Telugu News