: పదవిని కాపాడుకోవడానికి 50 మేకపోతుల్ని బలిచ్చిన మంత్రి

పదవీవ్యామోహం రాజకీయవేత్తలతో ఎలాంటి పనైనా చేయిస్తుంది. తాజాగా తన మంత్రి పదవికి ఎలాంటి గండం రాకూడదనే భావనతో ఓ తమిళ మంత్రి పదవీ రక్షణ పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఏకంగా 50 మేక పోతులను బలి ఇచ్చారు. వివరాల్లోకి వెళ్తే, తమిళనాడు, నాగపట్నం జిల్లా వేదారణ్యం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన మణియన్ ను దివంగత జయలలిత మంత్రిని చేశారు. శశికళకు కూడా మణియన్ విశ్వాసపాత్రుడే. చిన్నమ్మ బంధువు దినకరన్ కు కూడా ఆయన మద్దతుగా నిలబడ్డారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి పళనిస్వామి శిబిరంతో అంటీముట్టనట్టు ఉన్న ఆయనకు పదవీగండం భయం పట్టుకుంది. తనను మంత్రివర్గం నుంచి తొలగిస్తారేమోనని ఆయన ఆందోళన చెందుతున్నారు.

ఈ నేపథ్యంలో వేదారణ్యంలోని ప్రఖ్యాత వేదారణేశ్వరర్ ఆలయంలో వరుణయాగం నిర్వహించారు. ఈ యాగానికి ఆయనతో పాటు అన్నాడీఎంకేకు చెందిన నేతలు, కార్యకర్తలు మాత్రమే హజరయ్యారు. ఈ యాగం ముగిసిన వెంటనే ఆయన నేరుగా మునీశ్వర ఆలయానికి చేరుకున్నారు. అక్కడ 50 మేకపోతులను బలి ఇచ్చారు. తన పదవిని కాపాడుకోవడానికే మణియన్ ఈ పూజలు నిర్వహించారనే చర్చ ఇప్పుడు అక్కడ ఊపందుకుంది.

More Telugu News