: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ విద్యాసాగర్ గన్ లైసెన్స్ రద్దు... నయీమ్ తో స్నేహం ఫలితం!

గ్యాంగ్ స్టర్ నయీమ్ తో స్నేహం చేసి, పలు ల్యాండ్ సెటిల్ మెంట్ల వెనకున్నాడన్న ఆరోపణలను ఎదుర్కొంటున్న టీఆర్ఎస్ ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్, గన్ లైసెన్స్ ను పోలీసు అధికారులు రద్దు చేశారు. తన తుపాకీ లైసెన్స్ గడువు ముగియడంతో రెన్యువల్ కు ఆయన దరఖాస్తు చేసుకోగా, పలు కేసుల్లో ఆయనపై విచారణ జరుగుతున్నందున లైసెన్స్ ను పునరుద్ధరించలేమని పోలీసులు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.

నయీమ్ బతికి ఉన్నప్పుడు పలువురు రాజకీయ నేతలు, పోలీసు అధికారులు సైతం ఆయనతో అంటకాగినట్టు ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. నయీమ్ మరణానంతరం, వీరిపై విచారణ జరిపిన పోలీసులు ఇటీవలే ఐదుగురిని సస్పెండ్ చేశారు కూడా. ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్ తో పాటు, నయీమ్ దందాల్లో పాల్గొన్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే గాదరి కిషోర్ లను విచారణకు పిలిపించి, ఆపై వారిని అరెస్ట్ చేయవచ్చని వార్తలు వస్తున్నాయి. నయీమ్ అనుచరులపై నమోదు చేసిన పీడీ యాక్ట్ కేసుల్లో విచారణ వేగంగా సాగుతోందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. 

More Telugu News