: 1500 కోట్ల కుంభకోణాన్ని బయటపెట్టిన బెంజ్ కారు... ఎలా జరిగిందంటే...!

తాజాగా విశాఖపట్టణంలో వెలుగు చూసిన 1500 కోట్ల కుంభకోణం... నగర వాసులను ఆశ్చర్యానికి గురి చేసింది. నగరంలో ఇంత పెద్ద కుంభకోణం జరిగిందా? అంటూ అంతా ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ స్కామ్ ఎలా బయటపడిందంటే... కోల్ కతాలో ఉల్లిపాయల ఏజెంట్ గా పని చేసిన శ్రీకాకుళానికి చెందిన వడ్డి శ్రీనివాసరావు అక్కడ సంపాదించిన డబ్బుతో శ్రీకాకుళం పరిసరాల్లో చిన్నపాటి మైనింగ్‌ వ్యాపారం ప్రారంభించాడు. చుట్టుపక్కలవారు చూస్తుండగానే ఆ కుటుంబం ఆర్థిక స్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఇల్లు, జీవన విధానం... ఇలా అన్నింట్లో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి.

ఖరీదైన కార్లు, విలాసాల టూర్లు ప్రారంభమయ్యాయి. ఇలాంటి వారి బ్యాంకు లావాదేవీలపై ఐటీ విభాగం ఒక కన్నేసి ఉంచుతుంది. మరోపక్క, ఎవరికీ తెలియకుండా హవాలా వ్యాపారంలో కోట్లు పోగేసిన తనయుడు వడ్డి మహేశ్‌ ఇటీవల మెర్సిడెజ్‌ బెంజ్‌ కారు కొన్నాడు. దీంతో అతని ఆర్థిక మూలాలపై ఐటీ ఆరాతీసింది... శ్రీకాకుళంలో చిన్న మైనింగ్ కంపెనీ పెట్టిన వ్యాపారికి బెంజ్ లగ్జరీ మోడల్ కొనేంత లాభాలా? అని ఆశ్చర్యపోయిన ఐటీ శాఖాధికారులు మరింత లోతుగా వెళ్లగా... వందల కోట్ల హవాలా డొంక కదిలింది. తండ్రి సహకారంతో మహేష్... ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో వ్యాపారాలు చేస్తున్నామంటూ పలు షెల్ కంపెనీలు సృష్టించాడు.

ఈ తండ్రీకొడుకులు తప్పుడు టర్నోవర్‌ నివేదికలను పుట్టించారు. వివిధ పేర్లతో భారీ సంఖ్యలో పాన్‌ కార్డులు సమకూర్చుకున్నారు. మొత్తం 12 ఉత్తుత్తి కంపెనీల పేరిట ఏకంగా 29 బ్యాంకు ఖాతాలు తెరిచారు. వాటిలో 12 ఖాతాలు వడ్డి మహేశ్‌ కుటుంబ సభ్యులవే కావడం విశేషం. ఈ బ్యాంకు ఖాతాల ద్వారా హవాలా మార్గంలో డబ్బును విదేశాలకు తరలించడం మొదలుపెట్టారు. ఒక్కొ డాలరుకు 85 పైసల కమీషన్‌ చొప్పున తీసుకుని భారీ ఎత్తున... విదేశాల నుంచి కస్టమైజ్డ్‌ కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌ కొనుగోలు చేస్తున్నామని చెబుతూ... నెఫ్ట్‌, ఆర్టీజీఎస్‌ ద్వారానే చైనా, హాంకాంగ్‌, సింగపూర్‌ దేశాలకు డబ్బు పంపారు.

రెండేళ్లపాటు నిర్వహించిన ఈ దందాలో 569 కోట్ల రూపాయలు విదేశాలకు పంపినట్టు ఐటీ శాఖాధికారులు గుర్తించారు. దీంతో లెక్కలు వేసిన అధికారులు మొత్తం 1500 కోట్ల రూపాయలు ఈ కుంభకోణంలో చేతులు మారినట్టు గుర్తించారు. తొలిదశలో 578 కోట్ల రూపాయలు వీరి 29 అకౌంట్లలో జమ కాగా, అందులో 569 కోట్ల రూపాయలు వేర్వేరు ఖాతాలకు బదిలీ అయినట్లు గుర్తించారు. తరువాత 800 కోట్ల రూపాయలు హవాలా మార్గంలో చైనా, హాంకాంగ్‌, సింగపూర్‌ తదితర దేశాల్లోని ఐదు కంపెనీలకు తరలించినట్లు గుర్తించారు. దీని కోసం తమ మైనింగ్ కంపెనీలోని ఉద్యోగుల పేర్లను కూడా వాడుకున్నట్టు ఐటీ అధికారులు గుర్తించారు.

More Telugu News