: ఉత్తరకొరియాలో అడుగుపెట్టిన ప్రతి అమెరికన్ నరకం చూస్తున్నాడు!: కెనడా వ్యాపారవేత్త జేమ్స్ లైహ్

ఉత్తరకొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ ఆహ్వానం మేరకు ఆ దేశంలోని ప్యాంగ్యాంగ్ లో పర్యటించిన కెనడా వ్యాపారవేత్త జేమ్స్ లైహ్ సంచలన విషయాలు వెల్లడించారు. ఉత్తరకొరియాలోని జైళ్లలో అమెరికన్లు నరకం చూస్తున్నారని ఆయన తెలిపారు. అంతే కాకుండా అమెరికా, ఉత్తరకొరియా దేశాలు అధికారికంగా ప్రకటించినంతమంది కంటే ఎక్కువ మంది అమెరికన్లు ఉత్తరకొరియా జైళ్లలో నరకం చూస్తున్నారని ఆయన వెల్లడించారు. సుమారు ఎంత మంది ఉండొచ్చు? అని ఆయనను మీడియా ప్రశ్నించగా, ఊహించనంతమంది అని ఆయన సమాధానమిచ్చారు. అధికారులతో సమావేశాల అనంతరం జైళ్ల పనితీరును కూడా పరిశీలించానని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఇటీవల దేశద్రోహం కేసులో అరెస్టు అయిన అమెరికా ప్రొఫెసర్ టోనీ కిమ్ ని కూడా కలిశానని ఆయన వెల్లడించారు.

 ఈ సందర్భంగా టోనీ తనతో మాట్లాడుతూ, ‘మిమ్మల్ని ట్రంప్ పంపించాడా? యుద్ధోన్మాది పంపించాడా? ఏం చేయమన్నాడు ఇక్కడ? మీ ప్లాన్స్ ఏంటి?’ అని అడుగుతూ చిత్రహింసలు పెడుతున్నార’ని చెప్పారని తెలిపారు. దీంతో తనకు నోట మాటరాలేదని... అంతే కాకుండా ‘మీరు ఈ దేశం దాటి బయటకు వెళ్లేదాకా మీ ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే’ అంటూ హెచ్చరిస్తున్నారని కూడా ఆయన చెప్పారని జేమ్స్ తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటేనే ఉత్తరకొరియన్లు మండిపడుతుంటారని ఆయన వెల్లడించారు. సాధ్యమైనంత త్వరగా కిమ్ జాంగ్ ఉన్ తో వున్న సమస్యలను ట్రంప్ పరిష్కరించుకోవాలని, లేని పక్షంలో అక్కడి జైళ్లలో అమెరికన్లు మరింత నరకం చూస్తారని ఆయన తెలిపారు.

More Telugu News