: ఎయిర్ టెల్, ఐడియాపై జియో ఫిర్యాదు... సాక్ష్యాలుండటంతో విచారణ మొదలుపెట్టిన సీసీఐ

భారత టెలికం రంగంలోకి నూతనంగా ప్రవేశించి ఘన విజయం సాధించిన తమను అడ్డుకునేందుకు ఇప్పటికే ఈ రంగంలో ఉన్న భారతీ ఎయిర్ టెల్, వోడాఫోన్, ఐడియా సెల్యులార్ లతో పాటు సీఓఏఐ (సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) ప్రయత్నిస్తోందని రిలయన్స్ జియో ఇచ్చిన ఫిర్యాదుపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) విచారణ ప్రారంభించింది. జియో ఆరోపణలకు ప్రాథమిక సాక్ష్యాలున్నాయని భావించిన సీసీఐ, దీన్ని విచారించాలని నిర్ణయించింది.

 జియోకు వ్యతిరేకంగా మిగతా సంస్థలు ప్రచారాన్ని చేస్తున్నాయన్న ఆరోపణలపై విచారణకు నిర్ణయించినట్టు సీసీఐ అధికారి ఒకరు స్పష్టం చేశారు. భారత టెలికం రంగంలోని మూడు ప్రధాన సంస్థలు పోటీ తత్వాన్ని చూపకుండా, జియోపై అభాండాలు వేస్తున్నాయని, దీనిపై డైరెక్టర్ జనరల్ స్వయంగా విచారణ ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. తమకు వ్యతిరేకంగా వ్యాపార ప్రకటనలు గుప్పిస్తున్నారని, తమ కస్టమర్లకు కనెక్టివిటీ పోర్టులను అందించడం లేదని, నిత్యమూ కోట్లాది ఫోన్ కాల్స్ గమ్యానికి చేరుకోవడం లేదని జియో ఆరోపించింది.

కాగా, ఈ విచారణపై తమకు ఎటువంటి సమాచారమూ లేదని ఎయిర్ టెల్ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. తమకు తెలియని విషయమై స్పందించలేమని స్పష్టం చేశారు. మిగతా సంస్థలైన వోడాఫోన్, ఐడియా సెల్యులార్ లకు స్పందించాలని ఈ-మెయిల్స్ పంపినా వారు స్పందించలేదు. జియో ఫిర్యాదును తాము పరిశీలిస్తున్నామని కాయ్ డైరెక్టర్ జనరల్ రాజన్ మ్యాథ్యూస్ వ్యాఖ్యానించారు. తమ సభ్యులెవరూ నిబంధనలను అతిక్రమించలేదని భావిస్తున్నట్టు తెలిపారు.

More Telugu News