: నరాలు తెగే ఉత్కంఠ... నేడు పుణెకు, రేపు హైదరాబాద్ కు చావో రేవో తేల్చుకునే మ్యాచ్ లు!

ఐపీఎల్ పదవ సీజన్ పోటీలు తుది ఘట్టంలోకి అడుగుపెట్టాయి. పాయింట్ల పట్టికలో ముందు నిలిచిన ముంబై ఇండియన్స్ మాత్రమే ఇప్పటివరకూ ప్లే ఆఫ్ అవకాశాన్ని పొందగా, మిగిలిన మూడు స్థానాల కోసం నాలుగు జట్ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొని వుంది. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు రన్ రేట్ పరంగా పాజిటివ్ లో నిలిచి 16 పాయింట్లతో ఉండగా, పుణె జట్టు మైనస్ రన్ రేట్ తో 16 పాయింట్లతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. కోల్ కతా చేతిలో ఓ మ్యాచ్ ఉండగా, పుణె చేతిలో రెండు మ్యాచ్ లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నేడు పుణె జట్టు ఢిల్లీతో పోటీ పడనుంది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ గెలిస్తే, పుణె అవకాశాలు దారుణంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. అందువల్ల ఈ మ్యాచ్ పుణెకు చావో రేవో అన్నట్టే. గెలిచినా, ఓడినా పోయేదేమీ లేదు కాబట్టి (పాయింట్ల పట్టికలో 10 పాయింట్లతో ఆరో స్థానం) ఢిల్లీ జట్టు స్వేచ్ఛగా ఆడుతుందనడంలో సందేహం లేదు.

ఇక రేపు గుజరాత్ లయన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య ఈ సీజన్ లోనే అత్యంత ఉత్కంఠ మ్యాచ్ జరగనుంది. 8 పాయింట్లతో 7వ స్థానంలో ఉండి ప్లే ఆఫ్ అవకాశాలను దూరం చేసుకున్న గుజరాత్ కు ఈ మ్యాచ్ తో ఒరిగేదేమీ లేదు. అదే సమయంలో సన్ రైజర్స్ గెలిస్తేనే ప్లే ఆఫ్ కు చేరుతుంది. ఓడిపోతే, ఆదివారం నాడు కింగ్స్  ఎలెవన్ పంజాబ్, రైజింగ్ పుణె జయింట్స్ మధ్య జరిగే మ్యాచ్ లో పుణె జట్టు ఓడిపోవాలని కోరుకోవడం మినహా మరేమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది.

ఈ మ్యాచ్ లో పంజాబ్ జట్టు గెలిస్తే, హైదరాబాద్ ఇంటికి వెళ్లినట్టే. ఎందుకంటే 15 పాయింట్లున్న సన్ రైజర్స్ ను దాటి 16 పాయింట్లను పంజాబ్ జట్టు సాధిస్తుంది కాబట్టి. ఒకవేళ హైదరాబాద్, పంజాబ్ జట్లు రెండూ తమ మ్యాచ్ లలో గెలిస్తే, పుణె జట్టుకు చెక్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెట్ రన్ రేటులో వెనుకబడివున్న ఆ జట్టు భారీ తేడాతో ఓ మ్యాచ్ లో విజయం సాధిస్తే, మాత్రం 16 పాయింట్లు సాధించినా పంజాబ్ జట్టు ఇంటికి వెళ్లాల్సి రావచ్చు. ఏది ఏమైనా వచ్చే మూడు రోజుల మ్యాచ్ లూ ఈ సీజన్ లో అత్యంత కీలకం.

More Telugu News