: ఇండియాపై మరిన్ని ఉగ్రదాడులు... పాక్ ముష్కరులు పొంచివున్నారని హెచ్చరించిన అమెరికా

పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద గ్రూపులతో పొరుగున ఉన్న ఇండియా, ఆఫ్గనిస్థాన్ లతో పాటు అమెరికాకు కూడా ప్రమాదమేనని యూఎస్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ డానియల్ కోట్స్ హెచ్చరించారు. దేశ నిఘా వ్యవస్థపై సెనెట్ కమిటీకి నివేదిక ఇచ్చిన ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. భారత సరిహద్దుల్లో ఉగ్రవాదులు పొంచివున్నారని, వీరు చొరబడితే మరిన్ని ఉగ్రదాడులు జరగవచ్చని తెలిపారు. తమ దేశంలోని ఉగ్ర మూలాలను నాశనం చేయడంలో పాక్ తీవ్రంగా విఫలమవుతోందని, వారి వల్ల ఎప్పటికైనా ప్రమాదమేనని హెచ్చరికలు జారీ చేశారు.

గత సంవత్సరం జరిగిన పఠాన్ కోట్, యూరీ ఉగ్రదాడులను ప్రస్తావిస్తూ, ఈ ఘటనలకు పాల్పడింది సరిహద్దులు దాటి వచ్చిన ఉగ్రవాదులేనని, వీటి తరువాత భారత్, పాకిస్థాన్ నడుమ సంబంధాలు మరింతగా దెబ్బతిన్నాయని అన్నారు. భారత వ్యతిరేక మిలిటెంట్లను నిలువరించడంలో ఇస్లామాబాద్ పెద్దలు విఫలమవుతున్నారని, వారి వల్లే ద్వైపాక్షిక చర్చలు కూడా నిలిచిపోయాయని గుర్తు చేశారు. ఈ సంవత్సరం ఇరు దేశాల మధ్యా సంబంధాలు మరింత జటిలం కానున్నాయని, ఇదే సమయంలో హై-ప్రొఫైల్ టెర్రరిస్టు దాడులు జరిగే ప్రమాదం కూడా భారత్ ముందుందని పేర్కొన్నారు.

More Telugu News