: అత్యాచారం కేసులో పోలీసుల మీనమేషాలు.. ఐదు రోజులైనా కానరాని ఎమ్మెల్సీ కొడుకు

ముగ్గురు యువకులు తనపై అత్యాచారం చేశారంటూ ఈనెల 6న హైదరాబాదు శివారు, పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఓ యువతి ఫిర్యాదు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ప్రీతంరెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడు స్నేహిత్ రెడ్డితోపాటు అతడి స్నేహితుడు అరువారెడ్డిని అదుపులోకి తీసుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. వారిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్సీ కొడుకును కేసు నుంచి తప్పించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో అధికార పార్టీ నేతల నుంచి పోలీసులపై ఒత్తిడి ఉందని చెబుతున్నారు. కొడుకును రక్షించుకునేందుకు ఎమ్మెల్సీ భూపతిరెడ్డి ఇటీవల పోలీస్ ఉన్నతాధికారులను కలిసినట్టు సమాచారం. మరోవైపు ఈ కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తున్నామని, ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు.

బ్యూటీ పార్లర్‌లో పనిచేసే ఓ యువతిని ప్రేమపేరుతో నమ్మించిన ప్రీతంరెడ్డి ఈ నెల 6న కొంపల్లిలోని తన ఇంటికి ఆమెను రప్పించి అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాక తన స్నేహితులైన స్నేహిత్ రెడ్డి, అరవరెడ్డిని కూడా రప్పించి ఆమెపై సామూహిక అత్యాచారానికి  పాల్పడ్డారు. అత్యాచారాన్ని వీడియో కూడా తీసేందుకు ప్రయత్నించారు. వారి చెర నుంచి తప్పించుకునేందుకు యువతి ప్రయత్నించింది. దీంతో ఆమెను కారులో ఎక్కించుకుని ముగ్గురు కలిసి రాత్రి ఏడు గంటల సమయంలో బాధిత యువతిని కొంపల్లి సమీపంలో వదిలేశారు. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ప్రీతంరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలినవారు పరారీలో ఉన్నారు.

More Telugu News