: తమిళనాడును వదిలిన 'కియా'... ఏపీని ఎంచుకున్న కారణమిదే!

తమిళనాడుకు దక్కాల్సిన కొరియన్ కంపెనీ 'కియా' ప్లాంటును ఆంధ్రప్రదేశ్ తన్నుకుపోయిన విషయంలో పళనిస్వామి సర్కారుపై విమర్శనాస్త్రాలు పెరిగాయి. ఈ సంస్థ తన మాన్యుఫాక్చరింగ్ ప్లాంటును అనంతపురం జిల్లాలో నెలకొల్పేందుకు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఇప్పటికే తమిళనాడులో కియాకు చెందిన ఓ ప్లాంటు ఉండగా, రెండోదాన్ని కూడా తమిళనాడులోనే పెట్టాలన్న ఉద్దేశంతో సంస్థ చర్చలు సాగించింది. చివరికి ఏపీని ఎంచుకుంది.

 కియా సంస్థ ఏపీకి తరలివెళ్లడం వెనుక మంత్రులు డిమాండ్ చేసిన 'ఆమ్యామ్యా'లే కారణమన్న వాదన వినిపిస్తోంది. చెన్నైకి సమీపంలోని ఒరగాడంలో స్టేట్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ ఆఫ్ తమిళనాడుకు చెందిన స్థలం అందుబాటులో ఉండగా, దాన్ని కియాకు ఇచ్చేందుకు నిర్ణయించుకున్న తమిళనాడు మంత్రులు, ప్రాజెక్టుకయ్యే స్థలంలో 50 శాతం లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేశారని అందువల్లే ఆ సంస్థ వెనుకంజ వేసిందని పేరును వెల్లడించేందుకు ఇష్టపడని ఓ వ్యాపారవేత్త వ్యాఖ్యానించారు.

కాగా, ఈ విమర్శలను ఖండించిన తమిళనాడు పారిశ్రామిక మంత్రి ఎంసీ సంపత్, ఒకే రాష్ట్రంలో రెండు ప్లాంటులు ఉండరాదన్న విధానంతోనే కొరియా సంస్థ ఏపీని ఎంచుకుందని వెల్లడించారు. లంచాలు అడిగామనడాన్ని తప్పుబట్టారు. కాగా, ఇప్పటికే ఆటోమొబైల్ పరిశ్రమకు కేంద్రంగా తమిళనాడు విలసిల్లుతుండగా, ఫోర్డ్, హ్యుందాయ్, మిత్సుబిషి, దైమ్లర్, నిస్సాన్, రెనాల్ట్, బీఎండబ్ల్యూ వంటి ఎన్నో కంపెనీలు ప్లాంట్లను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కియాకు ఆగస్టు 2016లో 400 ఎకరాల భూమిని తమిళ సర్కారు ఆఫర్ చేసింది. ఇక్కడే రెండో యూనిట్ మొదలవుతుందని భావించినా, జయలలిత మరణం తరువాత మారిన పరిస్థితుల నేపథ్యంలో కియా ఏపీని ఎంచుకున్నట్టు తెలుస్తోంది.

More Telugu News