: కొడుకుకు గాయాలయ్యాయని మాత్రమే నారాయణకు చెప్పిన అధికారులు... ఆపై టీవీ చూసి కుప్పకూలిన నారాయణ!

నిన్న తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ నడుపుతున్న వాహనానికి ప్రమాదం జరుగగా, ఆపై నిమిషాల వ్యవధిలోనే ప్రాణాలు పోయిన సంగతి తెలిసిందే. ఈ వార్త లండన్ పర్యటనలో ఉన్న మంత్రి నారాయణకు ఎలా చేరిందంటే... తెల్లవారుజామున 5 గంటల సమయంలో నారాయణ గ్రూప్ సంస్థల జనరల్ మేనేజర్ విజయ భాస్కర్ రెడ్డికి సమాచారం అందింది. విషయాన్ని నారాయణకు ఎలా చెప్పాలో తెలియని స్థితిలో ఉన్న ఆయన, నారాయణతో పాటే లండన్ లో ఉన్న అధికారులకు ఫోన్ చేశారు.

ఆ సమయంలో లండన్ లో సమయం రాత్రి 12 గంటల ప్రాంతం కావడంతో అందరూ నిద్రలో ఉండి ఎవరూ తీయలేదు. వెంటనే నారాయణ ఫోన్ కూ విజయ భాస్కర్ రెడ్డి కాల్ చేశారు. ఆయన కూడా నిద్రలో ఉన్నారో... ఏమో! ఫోన్ లిఫ్ట్ చేయలేదు. కాసేపటికి ఫోన్ చూసుకున్న నారాయణ, విజయ భాస్కర్ రెడ్డికి ఫోన్ చేయగా, ఆయన కాల్ ఎంగేజ్ లో ఉండటంతో, ఓఎస్డీ పెంచలరెడ్డికి ఫోన్ చేశారు. ఆపై విజయ భాస్కర్ రెడ్డిని కూడా కాన్ఫరెన్స్ లోకి తీసుకున్నారు.

ఆ సమయంలో నిషిత్ కారుకు యాక్సిడెంట్ అయిందని, గాయాలు మాత్రమే అయ్యాయని నారాయణకు చెప్పారు. దాన్ని నమ్మని నారాయణ, వెంటనే టీవీ చానల్స్ చూశారు. వస్తున్న వార్తలను చూసిన ఆయన బెడ్ పైనే కుప్పకూలారు. ఆయన్ను ఓదార్చిన అధికారులు, వెంటనే రిటర్న్ ఫ్లయిట్ కు టికెట్లు తీసుకుని వెనక్కు బయలుదేరారు.

More Telugu News