: థమ్సప్ అనుకుని పురుగుల మందు తాగిన చిన్నారి మృతి!

థమ్సప్‌ కూల్ డ్రింక్ అనుకుని పొరపాటున పురుగుల మందు తాగిన ఘటన నల్గొండ జిల్లా కట్టంగూరు మండలంలో చోటుచేసుకుంది. ఆ ఘటన వివరాల్లోకి వెళ్తే... నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలంలోని బొల్లేపల్లి గ్రామంలో ముశం నరేష్‌ అనే వ్యక్తి తన ఇంట్లోని పెరట్లో కూరగాయల మొక్కలు పెంచుతున్నాడు. వాటి పెరుగుదల కోసం, చీడపీడలు చేరకుండా ఉండేందుకు క్రిమి సంహారక మందు కొట్టాలని భావించాడు. దీంతో గ్రామంలోని తెలిసిన వ్యక్తి దగ్గరున్న క్రిమి సంహారక మందును థమ్సప్ బాటిల్ లో పోసుకుని, ఇంటికి తెచ్చాడు.

అనంతరం ఇంట్లో మొక్కలకు మందు కొట్టి, ఆ థమ్సప్ బాటిల్ ను కూరగాయల మొక్కల మధ్యలో వదిలేశారు. అయితే ఆయన పెద్ద కుమారుడు ముశం భానుప్రకాష్‌ (5) ఆడుకుంటూ ఆడుకుంటూ కూరగాయల మొక్కల మధ్యకు వెళ్లాడు. అక్కడ థమ్సప్ బాటిల్ కపించడంతో అందులో ధమ్సప్ ఉందని భ్రమించి, క్రిమి సంహారక మందును తాగాడు. దీంతో తీవ్రమైన కడుపునొప్పితో బాధపడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు నల్గొండ ప్రభుత్వాసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.

More Telugu News