: వందల కోట్లు సంపాదించే ధోనీకి ఉద్యోగం వెనుక ప్రభుత్వం పాత్ర... సంచలనం కలిగిస్తున్న ఐపీఎల్ మాజీ బాస్ లలిత్ మోదీ లీక్!

ఐపీఎల్ మాజీ బాస్, ఇండియాలో అరెస్టుకు భయపడి విదేశాల్లో ఉంటున్న లలిత్ మోదీ మరో సంచలన ఆరోపణలు చేశారు. ఇండియా సిమెంట్స్ మార్కెటింగ్ విభాగంలో అప్పటి భారత క్రికెట్ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారధి మహేంద్ర సింగ్ ధోనీని వైస్ ప్రెసిడెంట్ గా నియమిస్తూ, ఆ సంస్థ యజమాని, బీసీసీఐ అప్పటి అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్ ఇచ్చిన లేఖను బహిర్గతం చేశారు. తనకున్న కాంట్రాక్టులతో ఏడాదికి రూ. 100 కోట్లను సంపాదించే ధోనీ, శ్రీనివాసన్ దగ్గర ఉద్యోగానికి ఒప్పుకోవడం వెనుక కేంద్ర పెద్దల మతలబు ఉందని, శ్రీనివాసన్ కు మేలు చేయడమే 'నార్త్ బ్లాక్' ఉద్దేశమని ఆరోపించారు.

2012 జూన్ 6వ తేదీతో ఆఫర్ లెటర్ వెలువడగా, జూలై 7వ తేదీ నుంచి ఆయన నియామకం అమలవుతుందని ఈ ఆఫర్ లెటర్ లో పేర్కొన్నట్టు తెలుస్తోంది. దీని ప్రకారం బేసిక్ వేతనంగా రూ. 43 వేలు, డీఏగా రూ. 21,970, స్పెషల్ పేగా రూ. 20 వేలు, ప్రత్యేక సదుపాయాలుగా రూ. 60 వేలను నెలకు చెల్లిస్తామని, వీటికి అదనంగా ప్రత్యేక హౌస్ రెంట్ అలవెన్స్, చెన్నై లో ఉండే సమయంలో కార్యాలయ నిర్వహణ ఖర్చులు ఇస్తామని, చట్టబద్ధంగా లభించే లాభాలను అందిస్తామని పేర్కొంది.

ఇప్పుడు దీన్ని బయటపెట్టిన లలిత్ మోదీ, ధోనీ వందల కోట్లను సంపాదిస్తున్న ధోనీ, ఎందుకు శ్రీనివాసన్ కంపెనీలో చేరాల్సి వచ్చిందన్న విషయాన్ని వెల్లడించాలని కోరారు. ఇక ఆయన కుమారుడు ఈ లేఖపై స్పందిస్తూ, బీసీసీఐలో ఇటువంటివి జరిగాయని తెలిసి తాను దిగ్భ్రాంతికి గురయ్యానని అనడం గమనార్హం. బీసీసీఐ పాత కాపులు యదేచ్ఛగా నిబంధనలను ఉల్లంఘించి ఇష్టానుసారం వ్యవహరించారనడానికి ఇదే సాక్ష్యమని అన్నారు.


More Telugu News