: 48 మంది బాలికలు సహా 94 మంది పిల్లలకు విముక్తి కల్పించిన చెన్నై పోలీసులు

మద్రాసు హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు 94 మంది పిల్లలకు విముక్తి కల్పించిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. బెగ్గర్ మాఫియా ముఠాల కబంధ హస్తాల్లో చిక్కుకొని బిక్షాటన చేస్తున్న 94 మంది పిల్లలను రక్షించామని చెన్నై పోలీసులు ప్రకటించారు. బెగ్గర్ మాఫియా ముఠాలు పిల్లలను ఎత్తుకొచ్చి బలవంతంగా వారి బాల్యాన్ని కాలరాస్తూ, వారితో బిక్షాటన చేయిస్తున్నాయని, వారికి విముక్తి కల్పించాలని ఎక్స్ నోరా ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు ఎంబీ నిర్మల్ మద్రాసు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు.

దీనిని విచారించిన జస్టిస్ నాగముత్తు, జస్టిస్ వి భారతీదాసన్ లు అలాంటి ముఠాలపై కఠిన చర్యలు తీసుకుని, బాలలకు విముక్తి కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో రంగంలోకి దిగిన చెన్నై పోలీసులు చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల పరిధిలో 47 ప్రత్యేక పోలీసు బృందాలతో దాడులు నిర్వహించి, 48 మంది బాలికలతో కలిపి మొత్తం 94 మందికి పునరావాసం కల్పిస్తున్నామని వెల్లడించారు. ఇకపై బెగ్గర్ మాఫియా ఇలాంటి ప్రయత్నాలు చేస్తే, తీవ్ర పరిణామాలుంటాయని పోలీసులు హెచ్చరించారు. 

More Telugu News