: మేం సాయపడతాం - మీరిక విరుచుకుపడండి: ముఖ్యమంత్రులతో రాజ్ నాథ్

మావోయిస్టులను అందమొందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే అన్ని చర్యలకూ కేంద్రం మద్దతిస్తుందని హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ అభయమిచ్చారు. ఈ ఉదయం నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డీజీపీలు, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమైన ఆయన, 'సమాధాన్' పేరిట కొత్త వ్యూహాన్ని ప్రతిపాదించారు. ఇందులో భాగంగా, భద్రతా దళాలకు అవసరమయ్యే నైట్ విజన్ కెమెరాల నుంచి అత్యాధునిక ఆయుధాల వరకూ కేంద్రమే సరఫరా చేస్తుందని, కూంబింగ్ కు వెళ్లే వారికి బులెట్ ప్రూఫ్ జాకెట్లను అందిస్తామని స్పష్టం చేశారు.

 సుక్మా జిల్లాలో జరిగిన మావోయిస్టుల దాడిని చూసిన భారతావని తీవ్ర ఉద్వేగానికి గురైందని రాజ్ నాథ్ వ్యాఖ్యానించారు. మావోలను ఎదుర్కొనేందుకు మరింత సన్నద్ధం కావాల్సి వుందని గుర్తించామని, అందుకు తగ్గ కార్యాచరణను త్వరలోనే ప్రతిపాదిస్తామని తెలిపారు. కేంద్ర సహకారాన్ని, నిధులను సద్వినియోగం చేసుకుంటూ, రాష్ట్ర ప్రభుత్వాలు అదనపు పోలీసు బలగాలను పంపుతూ నక్సల్స్ పై విరుచుకుపడాలని సూచించారు. కాగా, ఈ సమావేశానికి ఏపీ నుంచి డిప్యూటీ సీఎం చినరాజప్ప, డీజీపీ సాంబశివరావు హాజరు కాగా, తెలంగాణ నుంచి డీజీపీ అనురాగ్ శర్మ పాల్గొన్నారు.

More Telugu News