: తమిళ మంత్రులకు ఏకంగా రూ. 400 కోట్ల ముడుపులిచ్చిన శేఖర్ రెడ్డి... ప్రభుత్వానికి రిపోర్టు

తమిళనాడులో ఇసుక మాఫియా రారాజుగా పేరు తెచ్చుకుని, ప్రస్తుతం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కేసులను ఎదుర్కొంటున్న జే శేఖర్ రెడ్డి, మంత్రులు, ప్రభుత్వ అధికారులకు రూ. 400 కోట్ల మేరకు ముడుపులు ఇచ్చినట్టు ఆదాయపు పన్ను శాఖ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. గత సంవత్సరం డిసెంబరులో ఆదాయపు పన్ను అధికారులు శేఖర్ రెడ్డి ఇంటిపై దాడులు చేసినప్పుడు రూ. 34 కోట్ల కొత్త రెండు వేల రూపాయల నోట్లు సహా రూ. 142 కోట్లను రికవరీ చేసిన సంగతి తెలిసిందే.

పన్ను ఎగవేత కేసులో సీబీఐ కేసు నమోదు కాగానే ఈ దాడులు జరిగాయి. ఆపై జైలుకెళ్లిన శేఖర్ రెడ్డికి 87 రోజుల అనంతరం బెయిల్ లభించగా, బయటకు వచ్చిన మూడు రోజులకే తిరిగి అరెస్టై జైలుకు వెళ్లారు. ఇక ఈ తాజా నివేదిక విషయంలో విచారణకు ఆదేశించాలా? వద్దా? అన్నది ప్రభుత్వ నిర్ణయమని విచారణకు ఆదేశిస్తే, మంత్రులు కటకటాల వెనక్కు వెళ్లాల్సి వుంటుందని, ఆదేశించకుంటే, చెడ్డ పేరు వస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

More Telugu News