: పక్కపక్కనే కూర్చుని కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకోని అరుణ్ జైట్లీ, ఇషాక్ దార్

జపాన్ లోని యోకోహమాలో జరిగిన ఆసియా అభివృద్ధి బ్యాంకు 50వ వార్షికోత్సవాలకు హాజరైన భారత్, పాక్ ఆర్థిక మంత్రులు అరుణ్ జైట్లీ, మహ్మద్ ఇషాక్ దార్ లు మనస్ఫూర్తిగా పలకరించుకోలేదు సరికదా... చాలా సేపు పక్కనే కూర్చుని ఒకే చర్చలో పాల్గొన్నా కనీసం ఒకరి ముఖాలను మరొకరు చూసుకోలేదు. ఇద్దరు మంత్రులూ ఎడమొహం పెడమొహంగా వ్యవహరించినట్టు సీఎన్బీసీ నిర్వహించిన 'ఆసియా ఎకనామిక్‌ ఔట్‌లుక్‌: టాకింగ్‌ ట్రేడింగ్‌' కార్యక్రమం నిరూపించింది.

దాదాపు గంట సేపు ఈ చర్చా కార్యక్రమంలో జైట్లీ, దార్ పాల్గొనగా, చాలా విషయాల్లో పరస్పర అభిప్రాయ బేధాలు వీరి మధ్య కనిపించాయి. యూరప్ తో చైనాను అనుసంధానించే ఓబీఓఆర్ కు పాక్ మంత్రి మద్దతు పలుకగా, సార్వభౌమ సమస్యలు ఇమిడిన ఈ ప్రాజెక్టుపై తమకు ఎన్నో అభ్యంతరాలున్నాయని జైట్లీ వ్యాఖ్యానించారు. పాక్ - చైనా ఆర్థిక కారిడార్ ప్రాజెక్టును ప్రస్తావించిన దార్, దేశాల మధ్య సహకారం అవసరమని వ్యాఖ్యానించగా, సమగ్ర ఆర్థిక భాగస్వామ్యంలో భారత్‌ ఎన్నటికీ అంతర్భాగం కాదని, తమ దేశపు వాణిజ్యాన్ని అడ్డుకునే శక్తి ఎవరికీ లేదని జైట్లీ అన్నారు. కార్యక్రమం అనంతరం ఓ గ్రూప్ ఫోటో దిగిన అనంతరం జైట్లీ వెళ్లిపోయారు.

More Telugu News