: 40 డాలర్ల దిగువకు రానున్న క్రూడాయిల్ ధర... మరింతగా తగ్గనున్న 'పెట్రో' ధరలు!

ఇప్పటికే తగ్గుముఖం పట్టిన ముడిచమురు ధరలు, ఒపెక్ దేశాలు ఉత్పత్తిలో చూపుతున్న పట్టుదల కారణంగా సమీప భవిష్యత్తులో మరింతగా దిగిరానున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. జూలై నెల ఫ్యూచర్స్ కాంట్రాక్టులు 39 డాలర్ల దిగువకు ట్రేడ్ కావడం, సుమారు 7 మిలియన్ డాలర్ల విలువైన ఆప్షన్స్ చేతులు మారడంతో క్రూడాయిల్ ధరలు మరోసారి క్షీణిస్తాయని భావిస్తున్నారు. తాజా ట్రేడింగ్ లో వెస్ట్ టెక్సాస్ క్రూడాయిల్ ధర 46 డాలర్ల వద్ద ఉంది. ఇక ఏప్రిల్ 2016 తరువాత ఈ ధర 39 డాలర్ల దిగువకు రాలేదు.

ఫ్యూచర్స్ కాంట్రాక్టులో ఆగస్టు ధర 39 డాలర్ల దిగువకు పడిపోగా, 14 వేల లాట్ లు ట్రేడ్ అయ్యాయి. చమురు మార్కెట్ కు ప్రతికూలాంశాలే అధికంగా కనిపిస్తున్నాయని ఈ రంగ నిపుణుడు, ఇన్వెస్ట్ మెంట్ సంస్థ 'ఆప్షన్ సెల్లర్స్ డాట్ కామ్' వ్యవస్థాపకుడు జేమ్స్ కార్డియర్ వ్యాఖ్యానించారు. గడచిన మూడు వారాల్లో 13 శాతం మేరకు ధరలు పతనమైనాయని గుర్తు చేసిన ఆయన, తదుపరి నెల రోజుల వ్యవధిలో మరింతగా ధరలు పడిపోతాయని అంచనా వేశారు.

కాగా, అంతర్జాతీయ క్రూడాయిల్ ధరలకు అనుగుణంగా ప్రతి పక్షం రోజులకూ ఒకసారి ధరలను సవరిస్తున్న భారత చమురు కంపెనీలు, మరో వారంలో ఇంకోసారి ధరలను తగ్గిస్తూ, ప్రకటించవచ్చని అంచనా. ఆపై క్రూడాయిల్ ధర జూలై లో 39 డాలర్ల దిగువకు వస్తే దేశంలో పెట్రోలు, డీజెల్ ధరలు మరింతగా తగ్గుతాయి.

More Telugu News