: అమెరికా పవర్ గ్రిడ్ ను టార్గెట్ చేసిన నార్త్ కొరియా? అమెరికాకు పెను ప్రమాదం పొంచి ఉందన్న సీఐఏ మాజీ చీఫ్

అమెరికా హెచ్చరికలను సైతం లెక్క చేయకుండా ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ ఇటీవల ఓ భారీ క్షిపణి పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్ష ఫెయిల్ అయిందని ఉత్తరకొరియా ప్రకటించింది. అయితే, ఈ పరీక్ష విఫలం కాలేదని, గగనతలంలో దాన్ని పేల్చివేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీని వెనుక పక్కా ప్రణాళిక ఉందని అమెరికా ఇంటలిజెన్స్ సంస్థ సీఐఏ మాజీ చీఫ్ జేమ్స్ వూస్లీ భావిస్తున్నారు. ఉత్తరకొరియా ప్రయోగించిన క్షిపణి భూఉపరితలం నుంచి 71 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లిన తర్వాత పేలిపోయింది.

దీని గురించి ఆయన మాట్లాడుతూ, ఒకవేళ ఇంత ఎత్తులో ఓ అణ్వాయుధం పేలిపోతే జరిగే విపత్తు అంతా ఇంతా కాదని తెలిపారు. అత్యంత ఎత్తులో జరిగే ఈ న్యూక్లియర్ విస్ఫోటనాల వల్ల వెలువడే ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ రేడియేషన్ వల్ల లక్షలాది మంది ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని చెప్పారు. ఉత్తరకొరియా చేసిన ఈ పరీక్ష వల్ల అమెరికాకు తీవ్రమైన అపాయం పొంచి ఉందని జేమ్స్ అన్నారు. ఈ రకమైన దాడుల వల్ల భూమ్మీద ఉన్న పవర్ గ్రిడ్ లు పనికిరాకుండా పోతాయని చెప్పారు.

దీంతో, విద్యుత్తుతో అనుసంధానమైన అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైపోతాయని తెలిపారు. తినటానికి తిండి, తాగటానికి నీరు కూడా లభించవని అన్నారు. బ్యాంకింగ్, టెలీకమ్యూనికేషన్స్, మెడిసిన్, ఇలా అన్ని వ్యవస్థలు స్తంభించిపోతాయని తెలిపారు. అమెరికా మిలిటరీకి సంబంధించిన పరికరాలు, వ్యవస్థలు ఇలాంటి దాడులకు దెబ్బతినకుండా ఉండే రక్షణ వ్యవస్థ ఉందని... కానీ, పవర్ గ్రిడ్ లకు మాత్రం ఈ రక్షణ వ్యవస్థ లేదని చెప్పారు. గతంలో పసిఫిక్ మహా సముద్రంలో ఇలాంటి హై-ఆల్టిట్యూడ్ టెస్టును అమెరికా నిర్వహించిందని... దాని దెబ్బకు హవాయిలో విద్యుత్ కు అంతరాయం ఏర్పడిందని గుర్తు చేశారు.

సీఐఏ మాజీ చీఫ్ జేమ్స్ చెప్పిన వివరణ వింటుంటే... కిమ్ జాంగ్ వ్యూహం ఏమిటో క్లియర్ గా అర్థమవుతుంది. భూమి మీద ఉన్న లక్ష్యాలపై నేరుగా దాడి చేయకుండా... అంతకన్నా ఎక్కువ వినాశనానికి కారణమయ్యే దిశగా కిమ్ అడుగులు వేస్తున్నారు. ఆకాశంలో ఎంతో ఎత్తున న్యూక్లియర్ మిసైల్స్ ను పేల్చి, భూమ్మీద విధ్వంసం సృష్టించే దిశగా పరీక్షలు నిర్వహిస్తున్నారు.

More Telugu News