: ఆర్ఎస్ఎస్ కు పోటీగా డీఎస్ఎస్!

ఆర్ఎస్ఎస్ కు పోటీగా డీఎస్ఎస్ ను బీహర్ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ ప్రారంభించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) మత ఛాందసవాదాన్ని వ్యాపింపజేస్తోందని, విభజన వాదంతో దేశంలో చిచ్చురేపుతోందని... బహిరంగ ప్రదేశాల్లోనూ, వ్యక్తిగతంగానూ పరుష పదజాలం ఉపయోగిస్తూ యువతను తప్పుదోవ పట్టిస్తోందని, అలాంటి ఆర్ఎస్ఎస్, బీజేపీలకు చెక్ చెప్పేందుకు భారత్ లో ఆ సంస్థ రేపే అల్లర్లను అడ్డుకునేందుకు బీహార్ వైద్య శాఖ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ తో కలిసి తాను ధర్మ నిరపేక్ష సేవక్ సంఘ్ (డీఎస్ఎస్) ను రూపొందించామని అన్నారు. ఆరెస్సెస్‌ అఘాయిత్యాలను తాము అడుగడుగునా అడ్డుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ సంస్థ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ, కాషాయ పార్టీ నుంచి, ఆ పార్టీలోని సంకుచిత మనస్తత్వంగల నేతల నుంచి రెచ్చగొట్టే వ్యాఖ్యలు కాకుండా ఇంకా గొప్పగా ఏమీ ఆశించలేమని అన్నారు.

ప్రశాంతంగా అన్నదమ్ముల్లా ఉన్న దేశ ప్రజల్లో ఆర్ఎస్ఎస్ చీలికలు తేవడమే లక్ష్యంగా పని చేస్తోందని ఆయన మండిపడ్డారు. ఆర్ఎస్ఎస్ కేవలం హిందువులకు మాత్రమే మద్దతిస్తుందని, ఇతర మతాలు, అంశాలకు అనుకూలంగా ఎన్నడూ పెదవి విప్పదని ఆయన తెలిపారు. అలాగే ఇతర మతాలకు సంబంధించిన అంశాలు చర్చకు వచ్చినప్పుడు బీజేపీ, ఆర్ఎస్ఎస్ పరస్పరం సహకరించుకుంటాయని ఆయన తెలిపారు. ఇలాంటి విధానాలు సరికాదని... దేశ ప్రజలంతా సమానమేనని, వారి మధ్య మతాలు, కులాల పేరిట అడ్డుగోడలు సరికాదని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి విధానానికి ఆర్ఎస్ఎస్ వ్యతిరేకమని, అందుకే దానిని నిలువరించేందుకు డీఎస్ఎస్ ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. 

More Telugu News