: 5 కిలో మీటర్లకు 5 వేల రూపాయల ఛార్జ్ చేసిన ఉబెర్ క్యాబ్!

ఉబర్ క్యాబ్ సంస్థ ప్రయాణికులకు షాకింగ్ అనుభవాలు మిగులుస్తోంది. భారీ చార్జీలు చూపించి ప్రయాణికుల్ని బెంబేలెత్తిస్తోంది. తాజాగా బెంగళూరు రైల్వేస్టేషన్‌ లో దిగిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ బి.ఎస్‌.ప్రవీణ్‌ ‌మైసూరు రోడ్డులోని శాటిలైట్ బస్టాప్ దగ్గర్లో ఉన్న తన ఇంటికి వెళ్లేందుకు ఉబర్‌ క్యాబ్‌ ను బుక్‌ చేశారు. రైల్వేస్టేషన్‌ నుంచి మైసూర్‌ రోడ్డులోని శాటిలైట్ బస్టాప్ కు కేవలం ఐదు కిలో మీటర్ల దూరం.  అయితే, క్యాబ్ దిగిన అనంతరం క్యాబ్ డ్రైవర్ 5,325 రూపాయల బిల్లు ప్రవీణ్ చేతిలో పెట్టాడు.

దీంతో 5 కిలోమీటర్ల దూరానికి ఇంత బిల్లేంటని డ్రైవర్ ను అడగడంతో ప్రస్తుత బిల్లు కేవలం 103 రూపాయలేనని, గతంలో ఉబర్ వాడినప్పుడు అయిన బిల్లు 5,222 రూపాయలని తెలిపాడు. దీంతో తాను కేవలం రెండు సార్లు మాత్రమే ఉబెర్ వాడానని దానికి ఇంత బిల్లేంటని ఆయన మండిపడ్డాడు. దీంతో డ్రైవర్ ఉబెర్ కస్టమర్ కేర్ ను సంప్రదించగా, పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసైనా బిల్లు వసూలు చేయాలని సూచించింది. దీంతో పోలీసు స్టేషన్ కు ఇద్దరూ వెళ్లారు. అనంతరం అతని నుంచి 103 రూపాయల బిల్లు వసూలు చేసి ప్రవీణ్ ను పోలీసులు ఇంటికి పంపేశారు. సాంకేతిక లోపం కారణంగా ఈ తప్పిదం చోటుచేసుకుందని, దీనికి చింతిస్తున్నామని ఉబర్ తెలిపింది.

More Telugu News