: నేటి సాయంత్రం నింగిలోకి దూసుకెళ్లనున్న దక్షిణాసియా సాంకేతిక శాటిలైట్!

దక్షిణాసియా సాంకేతిక ఉపగ్రహం జీశాట్-9 ఇవాళ నింగికెగరనుంది. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నేడు మరో ఘనతను సొంతం చేసుకోనుంది. జీఎస్‌ఎల్వీ-ఎఫ్‌ 09 ప్రయోగం నేటి సాయంత్రం జరుగుతుంది. నిన్న మధ్యాహ్నం సరిగ్గా 1.57 నిమిషాలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. 27 గంటల అనంతరం అంటే నేటి సాయంత్రం 4:57 నిమిషాలకు జీఎస్‌ఎల్వీ-ఎఫ్‌ 09 కమ్యూనికేషన్‌ శాటిలైట్‌ ప్రయోగం జరగనుంది.

 దేశీయ క్రయోజెనిక్ ఇంజిన్‌ తో ప్రయోగిస్తున్న రాకెట్ల శ్రేణిలో జీఎస్‌ఎల్‌వీ ఎఫ్-9 నాల్గవది. ఈ ప్రయోగం సార్క్ సభ్య దేశాల మధ్య సాంకేతిక స్నేహబంధాన్ని మరింత పటిష్ఠం చేసేందుకు ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. పాకిస్థాన్ మినహా 7 సార్క్ సభ్యదేశాలకు ఉపయోగపడేలా 235 కోట్ల వ్యయంతో భారత్ దీనిని రూపొందించి, ప్రయోగిస్తోంది. ఈ కమ్యూనికేషన్ శాటిలైట్ 12 ఏళ్ల పాటు భారత్, దాని పొరుగు దేశాలకు ఉచితంగా సాంకేతిక సేవలందించనుంది. దక్షిణాసియా దేశాల మధ్య సమాచార మార్పిడి, విపత్తుల నిర్వహణలోనూ ఈ ఉపగ్రహం ఉపయోగపడుతుంది. 

More Telugu News