: ఏమండీ!...మా అమ్మ నిద్రపోతోంది...నాకు ఆకలేస్తోంది...తినడానికి ఏమైనా ఇవ్వరా?: తల్లి శవం పక్కన కూర్చున్న బాలుడి దీనగాథ

ఓ తల్లి శవం పక్కన కూర్చుని... అన్నెంపున్నెం ఎరుగని ఓ బాలుడు స్పందించిన తీరు గుంటూరు జిల్లా మాచర్ల బస్టాండులో పలువురిని కన్నీరు పెట్టించింది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... మాచర్ల బస్టాండ్‌ ఆవరణలో బిడ్డతో సహా వచ్చిన ఓ తల్లి హఠాత్తుగా కన్నుమూసింది. అయితే, తల్లి ప్రాణం పోయిందని తెలియని ఆ బాలుడు... నిద్రపోతోందని భావించి, పలు మార్లు ఆమెను నిద్ర లేపేందుకు ప్రయత్నించాడు. తన ప్రయత్నం విఫలం కావడంతో బస్టాండ్ ఆవరణలో ఉన్నవారిని... 'ఏమండీ!...మా అమ్మ నిద్రపోతోంది...లేపినా లేవడం లేదు...నాకేమో ఆకలేస్తోంది...ఎమైనా తినడానికి ఇవ్వరా?' అంటూ అడగడంతో ఆమెను లేపేందుకు వచ్చిన స్థానికులు షాక్ తిన్నారు.

ఆమె నిద్రపోవడం లేదు... శాశ్వత నిద్రలోకి జారుకుందని చెప్పినా అర్ధం కాని వయసు కావడంతో కొంత మంది... ఆమెలో కొనఊపిరేదైనా మిగిలి ఉందేమోనని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు....అక్కడి వైద్యులు ఆమె ప్రాణాలు పోయినట్టు తెలిపారు. దీంతో వారు పోలీసులకు సమాచారమందించారు... ఈ సందర్భంగా బాలుడి నుంచి వారి వివరాలు సేకరించారు. తన పేరు వంశీ అని.. తన తల్లి పేరు అంజలి అని .. తమది పిడుగురాళ్ల అని...తన చెల్లెలిని చూసేందుకు మాచర్ల వచ్చామని తెలిపాడు. అయితే వారి బంధువుల వివరాలు తెలిసే వరకు వంశీని వివేకానంద బాలల అనాథ ఆశ్రమంలో ఉంచాలని నిర్వాహకుడు గోవిందరెడ్డిని పోలీసులు కోరారు.  

More Telugu News