: పన్నీర్ సెల్వం అవినీతి బాగోతాన్ని బయటకు తీయండి.. అధికారులకు ముఖ్యమంత్రి పళని సంచలన ఆదేశాలు

విలీనం ఇక లేదని దాదాపు ఖాయమవడంతో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి జూలు విదిల్చారు. మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అవినీతి చిట్టాను బయటకు తీయాలంటూ మంగళవారం అధికారులను ఆదేశించారు. ఇటీవల పళనిస్వామి మాట్లాడుతూ తమ సత్తా ఏంటో, తమకు ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు ఉన్నారో చెబుతూ విలీనం ప్రసక్తే లేదని చెప్పకనే చెప్పారు.  ఇప్పుడు ఏకంగా పన్నీర్ అవినీతిని బయటకు తీయాలని ఆదేశించడం తమిళ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.

ఆర్థికమంత్రిగా పన్నీర్ సెల్వం ఆరేళ్ల కాలంలో చేసిన అవినీతి జాబితాను బయటకు తీసి సిద్ధం చేయాల్సిందిగా సీఎం ఆదేశించారు. అలాగే క్వారీల వ్యవహారంలో కాంట్రాక్టర్ శేఖర్‌రెడ్డితో ఉన్న సంబంధాలపైనా పళనిస్వామి దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఈనెల 5వ తేదీ నుంచి పన్నీర్ సెల్వం రాష్ట్ర పర్యటన జరపనున్న నేపథ్యంలోనే సీఎం వ్యూహాత్మకంగా ఆయన అవినీతి గురించి మాట్లాడుతున్నట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు చర్చల పేరుతో పళనిస్వామి వర్గం నాటకమాడుతోందని ఇటీవల పన్నీర్ సైతం తీవ్రస్థాయిలో విమర్శించారు. దీంతో ఇక ఇరు వర్గాలు చర్చలకు పుల్‌స్టాప్ పెట్టినట్టేనని, విలీనం ఇక ఎండమావేనని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరూ పరస్పరం ఢీకొనేందుకు సిద్ధపడినట్టు విశ్లేషకులు  భావిస్తున్నారు.

More Telugu News