: ప్రపంచంలో ఇదే హైస్పీడ్ కెమెరా...సెకనుకు ఐదు ట్రిలియన్ క్లిక్కులు

ఊహకు కూడా సాధ్యం కాని వేగంతో ఫోటోలు తీసే కెమెరాను స్వీడన్‌ లోని లుండ్‌ వర్సిటీ నిపుణులు తయారు చేశారు. ఈ హైస్పీడ్‌ కెమెరా ఫోటోగ్రఫీ పరంగా సరికొత్త విప్లవాన్ని తెస్తుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. దీంతో అందరి దృష్టీ దీనిమీదే వుంది. ఫ్రీక్వెన్సీ రికగ్నిషన్‌ అల్గారిథమ్‌ ఫర్‌ మల్టిపుల్‌ ఎక్స్‌ పోజర్స్‌ (ఫ్రేమ్‌) గా పిలిచే అధునాతన సాంకేతికత ఆధారంగా ఈ హై స్పీడ్ కెమెరా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. మనం దృష్టి కేంద్రీకరించే వస్తువుపై కెమెరా లేజర్‌ కిరణాలు పడేలాచేస్తుంది. ఈ లేజర్ కిరణాలు ఆ వస్తువుపై పడి పరావర్తనం చెందగానే వీటిని ప్రత్యేకంగా తయారు చేసిన అల్గారిథమ్ లు ఒక ఫోటోలా అమరుస్తాయి.

ఈ కెమెరా విడుదల చేసే ప్రతి లేజర్ కాంతి పుంజానికి ఒక ప్రత్యేకమైన కోడ్‌ ఉంటుంది. ప్రస్తుతం సెకనుకు లక్ష ఫోటోలు తీసే హైస్పీడ్ కెమెరా మాత్రమే ఉండడంతో పరిశోధనల్లో ఇంకొంత మెరుగైన ఫలితాలు సాధించేందుకు సెకనుకు ఐదు ట్రిలియన్‌ ఫోటోలను క్లిక్‌ మనిపించే అత్యాధునిక హై ఎండ్ కెమెరాను కనుగొన్నారు. కాగా, ఈ హైఎండ్ కెమెరాతో కాంతి ప్రయాణ వేగాన్ని కూడా చూడవచ్చని దీనిని తయారు చేసిన పరిశోధకులు చెబుతున్నారు. రెప్పపాటులో జరిగిపోయే రసాయన, భౌతిక, జీవ, వైద్య చర్యలన్నింటి పరిశీలనకు ఈ హైఎండ్ కెమెరా చక్కగా ఉపయోగపడుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కెమెరాతో శాస్త్ర, సాంకేతిక రంగాల్లో సరికొత్త విప్లవం మొదలవుతుందని వారు చెబుతున్నారు.

More Telugu News