: వచ్చే నెల 2 నుంచి హైదరాబాద్ లో ప్రపంచ తెలుగు మహాసభలు: సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్ లో ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఈ విషయమై ప్రగతి భవన్ లో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వచ్చే నెల 2 నుంచి 10వ తేదీ వరకు ఈ మహాసభలు జరుగుతాయని చెప్పారు. చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ మహాసభలు నిర్వహించాలని, తెలంగాణ సాహితీ వైభవాన్ని చాటి చెప్పేందుకు హైదరాబాద్ లో హోర్డింగ్ లు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.

మహాసభల్లో భాగంగా అవధానాలు, కవి సమ్మేళనాలు, పలు సాహిత్య ప్రక్రియలపై సదస్సులు నిర్వహించాలని, తెలంగాణ కవుల అముద్రిత గ్రంథాలను వెలుగులోకి తీసుకురావాలని ఆదేశించారు. నూతనంగా ఏర్పాటైన తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ఈ మహాసభలను నిర్వహించనున్నట్టు ఆయన ప్రకటించారు. తెలంగాణ సాహిత్య అకాడమీతో పాటు సంగీత-నాటక అకాడమీ, లలిత కళా అకాడమీ, జానపద అకాడమీలను కూడా ఏర్పాటు చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ సమీక్షలో ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ అయాచితం శ్రీధర్, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్, ప్రముఖ సాహితీవేత్తలు, తదితరులు పాల్గొన్నారు. 

More Telugu News