: చంద్రబాబు నిజంగానే తన రికార్డును తానే బద్దలు కొడుతూ వెళుతున్నారు!: జ‌గ‌న్ సెటైర్

రైతుల సమస్యల పరిష్కారం కోరుతూ నిన్న గుంటూరులో ప్రారంభించిన రైతు దీక్షను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఈ రోజు మ‌ధ్యాహ్నం విర‌మించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు త‌న రికార్డును తాను బ‌ద్ద‌లు కొట్టాన‌ని, అభివృద్ధి చేస్తున్నాన‌ని చెప్పుకుంటార‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అన్నారు. బాబు నిజంగానే తన రికార్డును తానే బద్దలు కొడతారని, చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి అయిన‌ప్ప‌టి నుంచి సాగు ప‌డిపోతూ వస్తోందని, ఆ విధంగా నిజంగానే రికార్డులు బ‌ద్ద‌లు కొడుతున్నార‌ని ఎద్దేవా చేశారు. చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి అయ్యాక వ‌ర‌స‌గా మూడేళ్లు ఒక్క ఏడాదిని మించి ఒక ఏడాది క‌ర‌వు వ‌చ్చింద‌ని... ఆ విధంగా నిజంగానే ఆయ‌న రికార్డును ఆయ‌నే బ‌ద్ద‌లు కొట్టార‌ని వ్యంగ్యాస్త్రం విసిరారు.

రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాల‌న‌లో ధాన్యాగారంగా ఉన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇప్పుడు ల‌క్షల హెక్టార్ల సాగు ప‌డిపోయింద‌ని జగన్ అన్నారు. ఇటువంటి గొప్ప రికార్డులు ఆయ‌న మాత్రమే బ‌ద్ద‌లు కొట్ట‌గ‌లుగుతారని చంద్ర‌బాబుని విమ‌ర్శించారు. 13 జిల్లాల‌తో కూడిన ఏపీలో ర‌బీలో ఎంత‌గానో పంట సాగు త‌గ్గిపోయింద‌ని అన్నారు. ఇటువంటి రికార్డులు చంద్ర‌బాబు నాయుడు మాత్ర‌మే బ‌ద్ద‌లు కొట్ట‌గ‌లుగుతారని జ‌గ‌న్ అన్నారు. మిర్చి ధ‌ర 5 నెలల క్రితం రూ. 6000 నుంచి 6500 వ‌ర‌కు ఉండేదని, ఇప్పుడు ఈ రోజు క్వింటాల్ ధ‌ర రూ.2500 నుంచి 2000గా ఉందని, తాను గుంటూరులోని మిర్చి యార్డును 5 వారాల క్రితం సంద‌ర్శించానని చెప్పారు.

చంద్ర‌బాబు నాయుడు ముఖ్య‌మంత్రి అయ్యేనాటికి రైతులు ల‌క్ష‌ణంగా రుణాలు తీసుకునే ప‌రిస్థితిలో ఉండేవారని, ఇప్పుడు రైతులు అప్పులు దొర‌క‌ని ప‌రిస్థితిలో ఉన్నార‌ని ఇటువంటి రికార్డును కూడా ఒక్క చంద్ర‌బాబు నాయుడే బ‌ద్దలు కొట్ట‌గ‌లుగుతారని జ‌గ‌న్ ఎద్దేవా చేశారు. బాబు వ‌స్తారు.. రైతులకు రుణాలు ఇస్తారు.. బ్యాంకుల్లో ఉన్న బంగారాన్ని తెచ్చిస్తారని చెప్పుకున్నారని, అవి ఏవీ జ‌ర‌గ‌డం లేద‌ని ఆయ‌న అన్నారు. రైతుల ఆత్మ‌హ‌త్య‌లు పెరిగిపోతూ వ‌స్తున్నాయ‌ని, ఈ రికార్డును కూడా చంద్ర‌బాబు బ‌ద్ద‌లు కొట్టారని జ‌గ‌న్ అన్నారు. మిర్చి ధ‌ర ప‌డిపోతున్నా ప్ర‌భుత్వం స్పందించ‌డం లేదని ఆయ‌న అన్నారు.

More Telugu News