: ఎర్రలైటు పోయి.. సైరన్ వచ్చె.. నిషేధంతో తెలివి మీరిన వీఐపీలు!

వీఐపీ కల్చర్‌కు ప్రతిరూపమైన ‘ఎర్రలైటు’ను కేంద్రం నిషేధించిన నేపథ్యంలో కొందరు వీఐపీలు కొత్త దారులు అన్వేషించి విజయం సాధించారు. అంతేకానీ వీఐపీ కల్చర్‌ను మాత్రం వదులుకునేందుకు ససేమిరా అంటున్నారు. మే 1 నుంచి వీఐపీల కార్లపై ఎర్రలైటును తొలగించాలని కేంద్రం ఆదేశించింది. పలు రాష్ట్రాలు కూడా కేంద్రంతో జతకలిశాయి. అయితే కొన్ని రాష్ట్రాల్లోని వీఐపీలు మాత్రం ఎర్రలైటుకు బదులు సైరన్‌తో మోతెక్కిస్తూ కొత్త పద్ధతిని కనిపెట్టారు. మధ్యప్రదేశ్, తెలంగాణలోని వీఐపీలు ఎర్రలైటు తొలగించి సైరన్ ఏర్పాటు చేసుకున్నారు. ఇక మహారాష్ట్ర‌లోని ప్రముఖలైతే ఎర్రలైటు లేకుండా బయటకు వెళ్లేందుకు ఇష్టపడడం లేదు.

హోంమంత్రిత్వశాఖ సహాయమంత్రి దీపక్ కేశార్కర్ డీజీపీకి ఓ లేఖ రాస్తూ కొత్త నిబంధనలను ఉల్లంఘించకుండా వీఐపీలని తెలిసేలా కొత్త పద్ధతి ఏదైనా ఉంటే చెప్పాలంటూ లేఖ రాశారు. తాను ప్రయాణిస్తున్నప్పుడు ఇతర వాహనాల నుంచి తన వాహనాలను ప్రత్యేకంగా చూపే అవకాశం ఉంటే చెప్పాలని లేఖలో పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లో కొందరు నేతలు ఎర్రలైటును తొలగించగా మరికొందరు మాత్రం బీకాన్(ఎర్రలైటు) స్థానంలో సైరన్లు ఏర్పాటు చేసుకున్నారు. నిజానికి సైరన్లు వాడడం సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్‌కు విరుద్ధం. ట్రాన్స్‌పోర్టు, పోలీస్ డిపార్ట్‌మెంట్లకు మాత్రమే సైరన్ల విషయంలో సడలింపు ఉంది. ఇతరులు ఎవరైనా సైరన్లు వాడితే రూ.5 వేల జరిమానా విధిస్తారు. అయితే వీటిని తోసిరాజని నేతలు సైరన్లు ఏర్పాటు చేసుకుంటున్నారు.

More Telugu News