: నేటితో ముగియనున్న గవర్నర్ నరసింహన్ పదవీకాలం.. మరో దఫాపై ఉత్కంఠ!

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ పదవీ కాలం నేటితో ముగియనుంది. దీంతో ఆయనను మరో విడత కొనసాగిస్తారా, లేక ఇక్కడితో సరిపెడతారా.. అన్న విషయంలో స్పష్టత లేదు. తమిళనాడుకు చెందిన నరసింహన్ జనవరి 25, 2007న చత్తీస్‌గఢ్ గవర్నర్‌గా నియమితులయ్యారు.

 జనవరి 2010లో బదిలీపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారు. మే 3, 2012తో మొదటి విడత పదవీ కాలం పూర్తయినా కేంద్రం మళ్లీ ఆయనను నియమించింది. జూన్ 2, 2014 నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్‌గా కొనసాగుతున్నారు. నేటి (మంగళవారం)తో రెండో విడత పదవీ కాలం కూడా ముగుస్తుండడంతో ఆయనను తిరిగి కొనసాగించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తుండగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడి అభిప్రాయం ఏమిటన్నది వెల్లడి కాలేదు.

నిజానికి గతంలో ఎవరినీ మూడు దఫాలుగా గవర్నర్‌గా కొనసాగించిన దాఖలాలు లేవు. దీనికి తోడు నరసింహన్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం నియమించడం కూడా ఆయనకు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. తమిళనాడు గవర్నర్‌గా పనిచేసిన రోశయ్యను తిరిగి కొనసాగించాలన్న అభ్యర్థనలు వచ్చినా కేంద్రం అప్పట్లో తోసిపుచ్చి విద్యాసాగర్‌రావును ఇన్‌చార్జి గవర్నర్‌గా నియమించింది.

ఈ నేపథ్యంలో, నరసింహన్ విషయంలో కేంద్రం నుంచి ఎటువంటి ప్రకటన వెలువడుతుందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరోవైపు జూలైలో రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అప్పటి వరకు నరసింహన్‌ను కొనసాగించడమే మేలన్న అభిప్రాయాన్ని కూడా కొందరు వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. అయితే ఈ విషయంలో మరో ఒకటి రెండు రోజుల్లోనే స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.

More Telugu News