: అసలు ఈయన ముఖ్యమంత్రేనా? అని ప్రజలు అసహ్యించుకుంటున్నారు: వైఎస్ జగన్

చంద్రబాబునాయుడి వంటి ముఖ్యమంత్రి పాలన ఎప్పుడు అంతమవుతుందా? అని రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలూ ఎదురు చూస్తున్నారని వైకాపా అధినేత వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం గుంటూరు సమీపంలోని నల్లపాడులో రైతు దీక్షను ప్రారంభించిన ఆయన, కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు. చంద్రబాబును చూసి, ఈయనసలు ముఖ్యమంత్రేనా? అని ప్రజలు అసహ్యించుకుంటున్నారని నిప్పులు చెరిగారు.

రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వట్లేదని, ధరల స్థిరీకరణకు కనీస నిధిని కూడా కేటాయించలేదని గుర్తు చేసిన ఆయన, పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అనుగుణంగా మద్దతు ధర పెంచడంలో సర్కారు ఘోరంగా విఫలమైందని, అందువల్లే రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని విమర్శలు గుప్పించారు. అన్నదాతలను ఆదుకుంటామని ఎన్నికల వేళ హామీలు గుప్పించిన ఆయన, ఓట్లు వేయించుకున్న తరువాత రైతు గురించి ఆలోచించిన దాఖలాలు లేవని చెప్పారు. చంద్రబాబు రైతుల గోడు వినుంటే, తాను ఈ దీక్ష చేయాల్సిన అవసరం వచ్చేది కాదని చెప్పారు.

కొంతకాలం క్రితం రూ. 15 వేలుగా ఉన్న మిర్చి ధర, పంట చేతికి వచ్చిన తరువాత రూ. 3 వేల వరకూ పడిపోతే, రైతులు ఎలా బతుకుతారని ప్రశ్నించిన ఆయన, వారిని ఆదుకునేందుకు కనీస చర్యలు కూడా ప్రభుత్వం చేపట్టలేదని ఆరోపించారు. పసుపు సహా అన్ని రకాల వాణిజ్య పంటల పరిస్థితి కూడా అలానే ఉందని గుర్తు చేశారు. పెట్టుబడి పెట్టిన రైతన్నకు పంట కోసినందుకు చెల్లించిన కూలీ డబ్బులు కూడా రాని పరిస్థితి నెలకొందని అన్నారు. చాలా చోట్ల పంటను కోయకుండానే వదిలేస్తున్నారని తన దృష్టికి వచ్చిందని, ఇంత ఘోరమైన స్థితి రైతుల ముందుకు రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు.

More Telugu News