: ప్రయాణికుల ప్రాణాలు పణంగా... ఇద్దరు ప్రైవేటు బస్ డ్రైవర్ల రాక్షసానందం!

అది తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలో నిర్మాణంలో ఉన్న రహదారి. ఆ దారిపై రెండు ప్రైవేటు బస్సులు గమ్యస్థానానికి చేరే తొందరలో పోటీ పడి పరుగులు తీస్తున్నాయి. ఈ పోటీ ఎలా ఉందో వెనక వస్తున్న ఓ బైకర్ వీడియో తీయగా, అదిప్పుడు వైరల్ అయి, వారి డ్రైవింగ్ లైసెన్సుల రద్దుకు దారితీయడంతో పాటు, బస్సుల యజమానులకు పోలీసులు వార్నింగ్ ఇచ్చేలా చేసింది. కోయంబత్తూరు - పొల్లాచ్చి హైవేపై జరిగిన ఈ ఘటనలో ప్రయాణికుల ప్రాణాలను గాల్లో పెట్టినట్టు, అన్ని రకాల సేఫ్టీ నిబంధనలనూ ఉల్లంఘించి, ర్యాష్ డ్రైవింగ్ చేయడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం, వేగంగా వెళుతూ, లైన్లు మారడం, రాంగ్ సైడ్ లోనూ 80 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లడం, ఎదురుగా వస్తున్న వాహనాలను భయభ్రాంతులకు గురిచేయడం కనిపిస్తున్నాయి.

ఓ బస్సును ఓవర్ టేక్ చేసే వేళ, మరో బస్సు లైన్ క్రాస్ చేసి రాంగ్ రూట్ లో దూసుకెళ్లి ముందుకు రాగా, దాన్ని ఓవర్ టేక్ చేసేందుకు మొదటి బస్సు డ్రైవర్ లైన్ మారాడు. ఆపై ఇద్దరు డ్రైవర్ల మధ్యా నెలకొన్న పోటీతో ప్రయాణికులు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కూర్చోవాల్సి వచ్చింది. ఈ వీడియోను చూసిన పొల్లాచ్చి పోలీసులు, నిర్మాణం జరుగుతున్న రోడ్లపై వికృత క్రీడకు దిగిన డ్రైవర్ల లైసెన్స్ లను సస్పెండ్ చేసినట్టు తెలిపారు.

More Telugu News