: బీఎస్ 3 ఎఫెక్ట్!.. ఆగిపోయిన 25 వేల ట్రాక్టర్ల విక్రయాలు!

కాలుష్య కారణాలతో ఏప్రిల్ 1 నుంచి బీఎస్-3 వాహనాల విక్రయాన్ని ఆపేయాలన్న సుప్రీం ఆదేశాలతో బీఎస్-3 ప్రమాణాలు కలిగిన వాహనాల రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. సుప్రీంకోర్టు తీర్పు ప్రభావంతో దేశవ్యాప్తంగా 25 వేల ట్రాక్టర్లు, 1500 నిర్మాణరంగ వాహనాలు కూడా మూలన పడ్డాయి. ఈ వాహనాల విషయంలో ప్రత్యేక నిబంధనలు అమల్లో ఉన్నా బీఎస్-3 వాహనాలనే కారణంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు తదితర రాష్ట్రాల్లోని రవాణాశాఖ అధికారులు ఈ వాహనాల రిజిస్ట్రేషన్లను ఆపేశారు.  

నిజానికి ట్రాక్టర్లకు ప్రత్యేకంగా భారత ట్రాక్టర్ ఉద్గార నిబంధనలు (ట్రెమ్) 3ఎ, నిర్మాణ రంగ పరికరాల వాహనాల (సీఈవీ)కు భారత్ స్టేజ్-3 నిబంధన అమల్లో ఉంది. ఈ వాహనాలకు, కార్ల వంటి వాహనాలకు పాటించే ప్రమాణాలకు తేడా ఉందని, అయినా రిజిస్ట్రేషన్లు ఆపేశారని నిర్మాణరంగ యంత్ర పరికరాల తయారీ సంస్థల సంఘం (ఐసీఈఎంఏ) అధ్యక్షుడు ఆనంద్‌ సుందరేశన్‌ ఆరోపించారు. వాహనాలు ఏవైనా బీఎస్-4 ప్రమాణాలకు అనుగుణంగా లేకపోతే వాటి రిజిస్ట్రేషన్‌ను ఆపేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

అయితే కోర్టు ఆదేశాలను తప్పుగా అర్థం చేసుకున్న రవాణాశాఖాధికారులు నిర్మాణ యంత్రపరికరాలు కలిగిన కొత్త వాహనాల రిజిస్ట్రేషన్‌ను కూడా ఆపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వేసవిలో చురుగ్గా సాగే నిర్మాణ రంగానికి ఇది శరాఘాతమని ఆయన పేర్కొన్నారు. నెలకు 5వేల వరకు సీఈవీలు అమ్ముడవుతుంటాయని, కానీ రిజిస్ట్రేషన్లు ఆగిపోవడంతో ఆ ప్రభావం మూడోవంతు వాహనాలపై పడిందని తెలిపారు. ట్రాక్టర్ల కాలుష్య ఉద్గార నిబంధనలపై రాష్ట్ర రవాణారంగ కమిషనర్లు, కేంద్ర రవాణాశాఖ నుంచి మరింత స్పష్టత కోసం ఎదురుచూస్తున్నట్టు అధికారులు  చెప్పినట్టు సుందరేశన్ పేర్కొన్నారు.

More Telugu News