: కశ్మీరీలను చుంచెలుకల్లా వాడుకుంటున్నారు... వాళ్లతో చర్చలేంటి?: బీజేపీ నేత రామ్ మాధవ్

కశ్మీర్ యువతీ యువకులను అడ్డుపెట్టుకుని వేర్పాటు వాదులు పబ్బం గడుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, వారిని తమ ముందు చుంచెలుకల్లా వాడుకుంటున్నారని, అటువంటి వారితో చర్చలు జరిపే ప్రసక్తే లేదని భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి రామ్ మాధవ్ వ్యాఖ్యానించారు. లోయలో హింసకు వేర్పాటువాదులే కారణమని అన్నారు. వారి ఉద్దేశం కేవలం ఒకే ఒక్కటని, లోయలో ప్రతి రోజూ ఒకరు మరణించాలన్న లక్ష్యంతో పావులు కదుపుతున్నారని, మృతదేహాలను అడ్డు పెట్టుకుని యువత సెంటిమెంటుతో రాజకీయపు క్రీడలను ఆడుతున్నారని ఆరోపించారు.

భద్రతా దళాలు, ప్రభుత్వం పరిస్థితిని చక్కదిద్దాలని నిత్యమూ ప్రయత్నిస్తుంటే, దాన్ని విజయవంతం కానీయకుండా చూడటమే వేర్పాటువాదుల ఉద్దేశమని సామాజిక మాధ్యమాల్లో ఆయన నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో శాంతిని నెలకొల్పే దిశగా భద్రతా దళాల కర్తవ్యం క్లిష్టతరంగా మారిందని అన్నారు. కాగా, కశ్మీర్ స్వతంత్రాన్ని డిమాండ్ చేస్తున్న వేర్పాటు వాదులతో చర్చలు కొనసాగించలేమని సుప్రీంకోర్టుకు మోదీ సర్కారు స్పష్టం చేసిన నేపథ్యంలో రామ్ మాధవ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

More Telugu News