: చెన్నై టు ఢిల్లీ.. విచారణ కోసం దినకరన్‌ను మళ్లీ వెనక్కి తీసుకొచ్చిన పోలీసులు

రెండాకుల గుర్తును నిలుపుకునేందుకు ఎన్నికల అధికారులకు లంచం ఇవ్వజూపిన కేసులో ఢిల్లీ పోలీసుల కస్టడీలో ఉన్న దినకరన్‌ను మళ్లీ ఢిల్లీ తీసుకొచ్చారు. ఈ కేసులో నాలుగు రోజుల విచారణ అనంతరం ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు దినకరన్‌ను ఈనెల 25న అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ కోర్టు దినకరన్‌కు ఐదు రోజుల పోలీసు కస్టడీ విధించింది. ఇప్పటికే పలుమార్లు విచారించిన ఆయనను మరింత విచారణ కోసం గురువారం చైన్నై తీసుకొచ్చారు.

ఈ సందర్భంగా ఆయన నివాసంతోపాటు ఈ కేసులో సంబంధం ఉందని భావిస్తున్న వారి ఇళ్లలోనూ సోదాలు నిర్వహించారు. నగరంలోని అడంబక్కం, కోలపక్కం తదితర ప్రాంతాను సందర్శించిన పోలీసు బృందం మరికొందరిని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. హవాలా వ్యాపారులు ఫైసల్, నరేశ్‌ల ద్వారా చెన్నై నుంచి ఢిల్లీ చేరుకున్న సొమ్ము వ్యవహారంలో దినకరన్‌కు లింక్ ఉండొచ్చని భావిస్తున్న పోలీసులు అందుకు సంబంధించిన సాక్ష్యాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు.  కాగా, ఈ కేసులో మరింత విచారణ కోసం శనివారం సాయంత్రం దినకరన్‌ను తిరిగి ఢిల్లీ తీసుకొచ్చారు.

More Telugu News