: ఢిల్లీ కోర్టులో గ్యాంగ్ వార్.. అండర్ ట్రయల్ ఖైదీ కాల్చివేత.. పోలీసులకూ గురిపెట్టినా పనిచేయని తుపాకి!

కోర్టు ఆవరణలో పోలీసులు చూస్తుండగానే ఓ దుండుగుడు విచారణ ఖైదీని దారుణంగా కాల్చి చంపాడు. అనంతరం పోలీసులను కాల్చేందుకు ప్రయత్నించగా తుపాకి పనిచేయకపోవడంతో పట్టుబడ్డాడు. ఇది పక్కా గ్యాంగ్ వార్ అని పోలీసులు తెలిపారు. ఢిల్లీలోని రోహిణి కోర్టు ఆవరణలో జరిగిందీ ఘటన. కిరాయి హంతకుడే ఈ ఘటనకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. వారి కథనం ప్రకారం.. నీతు దబోడియా గ్యాంగ్ సభ్యుడైన రాజేష్ దుర్ముత్ 16 దొంగతనాలు, హత్య, దోపిడీ కేసుల్లో నిందితుడు. కోర్టులో హాజరు పరిచేందుకు హరియాణా పోలీసులు అతడిని వాహనంలో తీసుకొచ్చారు. కోర్టు ఆవరణలో గుంపులో ఉండి ఎదురుచూస్తున్న మోహిత్ అనే దుండగుడు వాహనం దగ్గరగా వెళ్లి తుపాకి తీసి రాజేష్‌ను కాల్చాడు. రాజేష్ తప్పించుకునే ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు. ఓ తూటా రాజేష్ గుండెను చీల్చుకుంటూ పోయింది. దీంతో అతడు కుప్పకూలిపోయాడు.

రాజేష్‌ను కాల్చిన మోహిత్ వెంటనే మరో తుపాకి తీసి పోలీసులపై గురిపెట్టి కాల్చేందుకు ప్రయత్నించాడు. అయితే అది పనిచేయకపోవడంతో అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనకు రెండు రోజుల ముందు నుంచి హంతకుడు పోలీసుల వాహనాన్ని ఫాలో అవుతూ వచ్చాడని, కోర్టు పరిసరాల్లో రెక్కీ కూడా నిర్వహించినట్టు విచారణలో వెల్లడైంది. ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజిని స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మోహిత్ నుంచి రెండు ఆయుధాలు, రాడ్లు స్వాధీనం చేసుకున్నారు. నీతు దబోడియా ప్రత్యర్థి గ్యాంగ్ అయిన నీరజ్ బవానా గ్యాంగ్ సభ్యుడైన సతీశ్‌తో కలిసి మోహిత్ కోర్టుకు వచ్చినట్టు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం సతీశ్ పరారీలో ఉన్నట్టు పేర్కొన్నారు.

More Telugu News