: టెన్షన్ పెట్టించిన సూపర్ ఓవర్ లో బుమ్రా మ్యాజిక్ సాగిందిలా!

నిన్న రాత్రి గుజరాత్ లయన్స్, ముంబై ఇండియన్స్ మధ్య సాగిన ఐపీఎల్ పోరులో మ్యాచ్ టై కాగా, సూపర్ ఓవర్ లో బుమ్రా తన బాల్ తో మ్యాజిక్ చేసి, జట్టుకు విజయాన్ని అందించాడు. తొలుత సూపర్ ఓవర్ ను ఆడేందుకు ముంబై రాగా, హార్డ్ హిట్టర్లు బట్లర్, పొలార్డ్ లు మైదానంలోకి వచ్చారు. గుజరాత్ తరఫున ఫాల్క్ నర్ బౌలింగ్ చేశాడు. తొలి బంతికి బట్లర్ ఒక పరుగు సాధించగా, రెండో బంతికి పొలార్డ్ ఫోర్ కొట్టి, ఆపై మూడో బంతికి సిక్స్ కొట్టాడు. నాలుగో బంతికి పొలార్డ్, ఐదో బంతికి బట్లర్ అవుట్ కాగా, ముంబై ఇన్నింగ్స్ ముగిసింది.

 ఆపై 12 పరుగుల విజయలక్ష్యంతో గుజరాత్ బ్యాట్స్ మెన్ లు ఫించ్, మెకల్లమ్ లు రాగా, బంతిని బుమ్రా అందుకున్నాడు. తొలి బంతిని నోబాల్ గా వేశాడు. ఆపై వేసిన బంతిని ఫించ్ అందుకోలేకపోగా, లెగ్ బై రూపంలో ఓ పరుగు వచ్చింది. రెండో బంతిని బుమ్రా వైడ్ గా ఇచ్చి మరో పరుగు సమర్పించుకున్నాడు. ఆపై బంతిని మెకల్లమ్ అందుకోలేకపోయాడు. మూడో బంతికి బైస్ రూపంలో ఒక పరుగు వచ్చింది. అప్పటికి మూడు బంతులు ముగియగా, గుజరాత్ స్కోరు 4 పరుగులు.

విజయం సాధించాలంటే, మూడు బంతుల్లో 8 పరుగులు చేయాల్సిన స్థితిలో బుమ్రా తన అసలు మ్యాజిక్ చూపాడు. నాలుగో బంతిని ఫించ్ కి దొరక్కుండా వేశాడు. ఐదో బంతికి అతి కష్టం మీద ఫించ్ ఒక పరుగు సాధించగా, ఆరో బంతికి మెకల్లమ్ కూడా ఒక్క పరుగు మాత్రమే సాధించాడు. అలా 12 పరుగులు చేసి విజయం సాధించాల్సిన గుజరాత్ జట్టు 6 పరుగులకే పరిమితమైంది.

More Telugu News