: బాహుబలి-2 ఎఫెక్ట్! ప్రభాస్, మెగా ఫ్యాన్స్ మధ్య ఘర్షణ.. అమలాపురంలో ఉద్రిక్తత

బాహుబలి-2 సినిమా ప్రభాస్ ఫ్యాన్స్, మెగా అభిమానుల మధ్య వివాదాన్ని రాజేసింది. ఫలితంగా తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బాహుబలి-2 సినిమాను నిబంధనలకు విరుద్ధంగా ప్రదర్శిస్తున్నారంటూ సినీ హీరోల అభిమాన సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో సినిమా ప్రదర్శనకు సిద్ధంగా ఉన్న థియేటర్ల వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన యువకులు మోటారు సైకిల్ ర్యాలీతో డీఎస్పీ, ఆర్డీవో కార్యాలయాల వద్దకు చేరుకుని నిరసన తెలిపారు.

శుక్రవారం నుంచి ఆరు షోలు వేసేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి ఉండడంతో ఆ మేరకు థియేటర్లు ఏర్పాట్లు చేసుకున్నాయి. అయితే కొందరు మాత్రం రాష్ట్రస్థాయి పోలీసుల అధికారుల నుంచి అనుమతులు తెచ్చుకుని గురువారం రాత్రే సినిమాను ప్రదర్శించాలని నిర్ణయించుకుని టికెట్ ధరలను భారీగా పెంచి విక్రయించారు. విషయం తెలిసిన చిరంజీవి, పవన్ కల్యాణ్‌ అభిమాన సంఘాలు సహా వివిధ అభిమాన సంఘాలకు చెందిన వందలాది మంది పోలీస్ స్టేషన్‌కు చేరుకుని అర్ధరాత్రి దాటిన తర్వాతే సినిమా ప్రదర్శించేలా చూడాలని, లేదంటే తామే సినిమా ప్రదర్శనను అడ్డుకుంటామని హెచ్చరించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో వారు డీఎస్పీ, ఆర్డీవో కార్యాలయం వద్ద బైఠాయించారు. విషయం తెలిసిన ప్రభాస్ ఫ్యాన్స్ రంగంలోకి దిగడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. మాటామాటా పెరగడంతో ఉద్రిక్తంగా మారింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, రెవెన్యూ అధికారులు సినిమా ప్రదర్శించనున్న రెండు థియేటర్ల వద్ద మోహరించారు.

More Telugu News