: కాళ్లు చాపుకుంటానంటే విమానం నుంచి గెంటేశారు.. కేన్సర్, మధుమేహ రోగికి తీవ్ర అవమానం

విమానయాన సంస్థల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ప్రయాణికుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నాయి. ఇటీవల సామర్థ్యానికి మించి ఉన్నారంటూ ఓ వైద్యుడిని కిందకు ఈడ్చిపడేసిందో ఓ విమానయాన సంస్థ. తాజాగా కేన్సర్, మధుమేహ బాధితుడిని తీవ్రంగా అవమానించింది బ్రిటిష్ ఎయిర్‌వేస్. జమైకాకు చెందిన క్వామే బంటు (65) క్యాన్సర్, మధుమేహంతో బాధపడుతున్నాడు. బ్రిటిష్ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానంలో బ్రిటన్‌లోని గాట్విక్ నుంచి జమైకా రాజధాని కింగ్స్‌టన్‌కు ఎకానమీ క్లాస్‌లో ప్రయాణిస్తున్నాడు. అలా కూర్చుని ఉండడంతో అతడి కాళ్లు వాచిపోయాయి. దీంతో కాళ్లు చాపుకునేందుకు ఫస్ట్‌క్లాస్ క్యాబిన్‌లోకి వెళ్లాడు. అంతే.. అక్కడ అతడిని చూసిన విమాన సిబ్బంది లాక్కొచ్చి ఆయన సీట్లో పడేశారు. అంతేకాదు, కాళ్లు, చేతులు కట్టిపడేశారు. టాయ్‌లెట్‌కు వెళ్లాలని చెబుతున్నా వినిపించుకోకుండా మొండిగా ప్రవర్తించారు.

క్వామేకు సాయం చేయబోయిన తోటి  ప్రయాణికురాలిపైనా సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. అంతేకాదు.. విమానాన్ని మధ్యలో టెర్సేరియా ద్వీపంలోని విమానాశ్రయంలో ల్యాండ్ చేసి క్వామే, అతడికి సాయం చేసేందుకు ప్రయత్నించిన మహిళను లగేజీ కూడా ఇవ్వకుండా బలవంతంగా దించేశారు. క్వామే తన సీటులోకి వెళ్లేందుకు నిరాకరించాడని, అతడు దుర్బాషలాడడం వల్లే మధ్యలోనే దింపేయాల్సి వచ్చిందని బ్రిటిష్ ఎయిర్‌లైన్స్ వివరణ ఇచ్చింది. మహిళ క్వామేకు తోడుగా ప్రయాణిస్తున్నట్టు చెప్పడం వల్లే ఆమెను కూడా దించేశామని పేర్కొంది.

More Telugu News