: బీసీసీఐ వ్యూహానికి ఐసీసీ ప్రతివ్యూహం... ఎవరు దిగివస్తారు?

ఐసీసీ నిర్ణయంతో ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాల్గొనే అవకాశం లేదని బీసీసీఐ అధికారులు పేర్కొంటున్న నేపథ్యంలో.... బీసీసీఐని దారికి తెచ్చుకునే వ్యూహాలను ఐసీసీ చీఫ్ శశాంక్ మనోహర్ అమలు చేసే ప్రయత్నంలో ఉన్నారు. బీసీసీఐ ఆలోచనలను తనకు అనుకూలంగా ఉన్నవారితో తెలుసుకున్న శశాంక్ మనోహర్... భారత్ కు మరో 100 మిలియన్ డాలర్లు అదనంగా ఇచ్చే ఆలోచన చేస్తున్నామని లీకులిస్తున్నాడు. నూతన ఆదాయ పంపిణీ నమూనా ప్రకారం 293 మిలియన్‌ డాలర్లకు అదనంగా మరో 100 మిలియన్‌ డాలర్లను కలిపి బీసీసీఐకి ఇచ్చేందుకు ఐసీసీ సిద్ధంగా ఉందని దుబాయ్‌ లో ఉన్న బీసీసీఐ ప్రతినిధి తెలిపారు. నూతన ఆదాయ పంపిణీలో భాగంగా ఐసీసీ సభ్య దేశాలకు 100 మిలియన్ డాలర్లు చెల్లిస్తామని, ఐసీసీ నిర్వహించే టోర్నీల ఆదాయం మొత్తం ఐసీసీకి ఇవ్వాలంటూ ఐసీసీ చీఫ్ శశాంక్‌ మనోహర్‌ సరికొత్త ప్రతిపాదన ఉంచిన సంగతి, దీనిపై జరిగిన ఓటింగ్ లో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు 2-8 ఓట్ల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే.

దీంతో ఐసీసీకి భారీ ఆదాయాన్నిచ్చే భారత్ కు 293 మిలియిన్ డాలర్లు ఇస్తామని శశాంక్ మనోహర్ కొత్త ప్రతిపాదన తెచ్చారు. ఇప్పుడు దానిని కూడా సవరించి దానికి అదనంగా మరో 100 మిలియన్‌ డాలర్లను ఇస్తామని ప్రకటించారు. అయితే పాత విధానంలో 576 మిలియన్ డాలర్లు అందుకుంటున్న బీసీసీఐ భారీ నష్టాన్ని భరించేందుకు సిద్ధంగా లేదు. అంతేకాకుండా, తమ దేశం ద్వారా వచ్చే సంపాదనను భారీ ఎత్తున ఇతర దేశాలకు పంపకాలు చేయడానికి బీసీసీఐ సిద్ధంగా లేదు. దీంతో ఐసీసీ నిర్వహించనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టును ఎంపిక చేయలేదు. భారత్ ఆడకపోతే టెలివిజన్ హక్కులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీంతో ఐసీసీ నెమ్మదిగా బీసీసీఐని దారికి తెచ్చుకునేందుకు పావులు కదుపుతోంది.

100 మిలియన్‌ డాలర్ల ప్రతిపాదనను ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో సభ్యుల ముందుంచిన తర్వాత ఏ విషయమైందీ చెబుతామని బీసీసీఐకి ఐసీసీ తెలియజేసిందని, 390 మిలియన్‌ డాలర్లకు బీసీసీఐ అంగీకరిస్తే బోర్డు సమావేశంలో ఆమోదిస్తామని ఐసీసీ తమకు తెలియజేసిందని బీసీసీఐ సీనియర్‌ అధికారి వెల్లడించారు. ఐతే పరిపాలన విధానంలో మార్పుల్లేకుండా 450 మిలియన్‌ డాలర్లకు ఐసీసీ ఒప్పుకోవచ్చని కొందరు అధికారులు చెబుతుండగా, బీసీసీఐ ఒప్పుకుంటుందా? అన్నదే అనుమానం. అయితే 450 మిలియన్‌ డాలర్లు బీసీసీఐకి ఇస్తామని ఐసీసీ ప్రతిపాదిస్తే... బీసీసీఐ అనుబంధ సభ్యులను తాను ఒప్పిస్తానని భారత ప్రతినిధి అమితాబ్‌ చౌదరి చెబుతున్నట్టు తెలుస్తోంది. అయితే బీసీసీఐతో విభేదిస్తున్న శశాంక్ మనోహర్‌ ఈ ప్రతిపాదనను అంగీకరించే పరిస్థితిలో లేడని తెలుస్తోంది. ఐసీసీ, శశాంక్ మనోహర్ మెడ వంచేలా చేయాలంటే భారత జట్టు ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఆడకపోవడమే సరైన మార్గమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

More Telugu News