: శశికళ, దినకరన్ అయిపోయారు...నెక్ట్స్ ఎవరు?

విశ్వాసం పేరుతో పార్టీని హస్తగతం చేసుకోవడం ద్వారా ముఖ్యమంత్రి పీఠాన్ని సొంతం చేసుకుని తమిళనాడును పరిపాలించాలని భావించిన శశికళ పరప్పణ అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. జైల్లో ఉన్నప్పటికీ తన మాటే నెగ్గాలని భావించిన ఆమె తన మేనల్లుడు దినకరన్ ను పార్టీ  డిప్యూటీ జనరల్ సెక్రటరీగా నియమించడం ద్వారా చెప్పుచేతల్లో పెట్టుకోవాలని భావించారు. అయితే ఆయన రెండాకుల గుర్తుకోసం చేసిన లోపాయకారీ ప్రయత్నాలు ఢిల్లీ జైలు గోడల్లో మగ్గేలా చేశాయి.

ఈ పరిణామాలతో మన్నార్ గుడి మాఫియా కుదరుగా ఉండే అవకాశం లేదని, కుట్రలు, కుతంత్రాలు, కుయుక్తులతో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతుందని ఢిల్లీ పెద్దలకు సమాచారం అందినట్టు కనిపిస్తోంది. దీంతో మన్నార్ గుడి మాఫియాలో కీలకంగా మారే అవకాశమున్న నేతలు, జయలలిత అధికారంలో ఉన్న సమయంలో అక్రమంగా ఆస్తులు కూడబెట్టినవారిని కేంద్రం తదుపరి లక్ష్యంగా చేసుకోనున్నట్టు తెలుస్తోంది.

శశికళ కుటుంబానికి చెందిన వారి గుప్పెట్లో అనేక సంస్థలు, సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్‌ ఉన్నట్టుగా గతంలో ఆరోపణలు వచ్చాయి. వాటి వివరాలతో వార్తలు కూడా వెలువడ్డాయి. అలాగే, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లోనూ ఆస్తుల్ని సంపాదించినట్టు తెలుస్తోంది. వీటితో పాటు జయలలిత మరణానంతరం ఆమెకు సంబంధించిన పత్రిక, టీవీ ఛానళ్లు, సిరుదావూర్‌ బంగ్లా, కొడనాడు ఎస్టేట్, మిడాస్‌ లిక్కర్, జోష్‌ సినిమాస్‌ వంటి వాటిని ఎవరు పరిరక్షిస్తున్నారు? వంటి పూర్తి వివరాలను యుద్ధప్రాతిపదికన సేకరిస్తున్నారు. వీరందరిపై త్వరలో దాడులు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

More Telugu News