: నక్సల్స్ పీచమణిచేందుకు కదిలిన కేంద్రం... మట్టుబెట్టాల్సిన కీలక నేతల పేర్లతో 'హిట్ లిస్ట్'

సుక్మా జిల్లాలో భీకర దాడి చేసి 25 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను బలిగొన్న నక్సలైట్ల పీచమణిచేందుకు సిద్ధమైన నరేంద్ర మోదీ సర్కారు, కీలక నేతలను టార్గెట్ చేసింది. మావోయిస్టుల నేతలుగా ఉన్న వారి పేర్లను ప్రస్తావిస్తూ, హిట్ లిస్టును తయారు చేసి, తొలుత వారు లక్ష్యంగా కూంబింగ్ చేయాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. దక్షిణ బస్తర్ డివిజనల్ కమాండ్ రఘు, జగర్ గుండ ప్రాంత కమిటీ హెడ్ పాపారావు, ఫస్ట్ బెటాలియన్ ఆఫ్ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కమాండర్, సుక్మా దాడి వెనుక ప్రధాన సూత్రధారి హిద్మాలతో పాటు ఆర్కే తదితరుల పేర్లు ఈ జాబితాలో ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. నక్సల్స్ నేతలు, ఏరియా కమాండర్లను అంతం చేయడం ద్వారా వారిలో నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలని జవాన్లకు ఆదేశాలు ఇచ్చినట్టు తెలిపారు.

బస్తర్ ప్రాంతంలో ఇప్పటివరకూ ఉన్న 250 మంది వివిధ కమిటీల నేతలు, ఏరియా కమాండర్లు ఇప్పుడు జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్రలకు వెళుతున్నారని, ఈ ప్రాంతంలో 4 వేల మంది నక్సలైట్లు, వారికి సాయంగా 12 వేల మంది వరకూ 'జన్ మిలీషియా' సభ్యులు ఉన్నారన్న అంచనాలున్నాయని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. గత సంవత్సరం చాలా మందిని అరెస్ట్ చేసినప్పటికీ, వారి నాయకులు ఈ తరహా దాడులకు ప్రణాళికలు రూపొందిస్తున్నారని, ఇప్పుడిక వారిని తప్పించే సమయం వచ్చిందని అన్నారు. కాగా, మావోల దాడిని సీరియస్ గా తీసుకున్న హోం మంత్రి రాజ్ నాథ్, గో ఎహెడ్ ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.

More Telugu News