: మత స్వేచ్ఛ క్షీణించిన 12 దేశాల జాబితాలో భారత్ ను చేర్చిన అమెరికా!

ప్రపంచంలోనే అతి పెద్ద లౌకిక దేశమైన భారత్ లో మతపరమైన స్వేచ్ఛ, సహనం క్షీణించాయంటూ అమెరికాకు చెందిన ఓ కమిషన్ తన నివేదికలో పేర్కొంది. 2016లో పరమత సహనం పెద్ద ఎత్తున క్షీణించిందని తెలిపింది. మత స్వేచ్ఛ ఉల్లంఘనలు ఎక్కువగా ఉన్న 12 దేశాల జాబితాలో ఇండియాను చేర్చింది. భారత్ లోని 10 రాష్ట్రాల్లో మత స్వేచ్ఛ ఉల్లంఘనలు పరిపాటిగా మారాయని తన నివేదికలో కమిషన్ పేర్కొంది. గోవధ, మత మార్పిళ్లు, స్వచ్ఛంద సేవా సంస్థలకు విదేశీ నిధులపై ఆంక్షలు, బౌద్ధులు, జైనులు, సిక్కులను హిందువులుగా చూపుతున్న రాజ్యాంగ నిబంధనల వల్లే ఇలాంటి పరిస్థితి తలెత్తిందని తెలిపింది.

భారత ప్రధాని నరేంద్ర మోదీ పరమత సహనం గురించి బహిరంగంగానే మాట్లాడుతున్నారని... అయితే అధికార పార్టీకి చెందిన నేతలు హిందూ అతివాద జాతీయవాదులతో సంబంధాలు కలిగి ఉన్నారని పేర్కొంది. ఇండియాలో మైనార్టీలు అభద్రతకు లోనవుతున్నారని తెలిపింది. మతపరమైన నేరాలకు పరిష్కారాలు లభించడం లేదని చెప్పింది. భారత్ తో జరిగే ద్వైపాక్షిక చర్చల్లో మత స్వేచ్ఛపై ఆందోళనను కూడా చేర్చాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.

More Telugu News