: దినకరన్ అరెస్టుపై ఆయన వ్యతిరేక వర్గం నేతలు ఏమన్నారంటే...!

తమిళనాడులో టీటీవీ దినకరన్ అరెస్టుతో మన్నార్ గుడి మాఫియా ఎలాంటి చర్యలకు దిగుతుందోనన్న ఆందోళనతో ఉన్న నేతలు ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకపోవడంతో హాయిగా ఊపిరిపీల్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దినకరన్ అరెస్టుపై ఆయన వ్యతిరేక వర్గం నేతలు ఆచితూచి కామెంట్ చేశారు. మంత్రి టీవీ షణ్ముగం మాట్లాడుతూ, టీటీవీ దినకరన్ తో పార్టీకి ఎలాంటి సంబంధాలు లేవని అన్నారు. ఆయనను పార్టీ నుంచి వారం క్రితమే బహిష్కరించామని తెలిపారు. దీనిని దినకరన్ కూడా అంగీకరించారని ఆయన గుర్తు చేశారు. ఈసీకి లంచం ఇచ్చేందుకు ప్రయత్నించి అరెస్టయిన కేసును దినకరన్ చట్టపరంగా ఎదుర్కొంటారని, ఎన్ని అడ్డంకులున్నా పార్టీని ఐక్యంగా బలపరచాలన్నదే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. తమ ముందున్న లక్ష్యం పార్టీలో ఏకాభిప్రాయం సాధించడం, పార్టీ గుర్తును మళ్లీ తిరిగి పొందడమేనని ఆయన తెలిపారు.

పన్నీరు సెల్వం  వర్గ నేత మునుస్వామి మాట్లాడుతూ, అన్నాడీఎంకేను కైవసం చేసుకొనేందుకు తప్పుడు ప్రయత్నాలు చేసినందువల్లే టీటీవీ దినకరన్ ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారన్నారు. అన్నాడీఎంకే వ్యవ స్థాపకుడు ఎంజీఆర్‌ మరణించిన సమయంలో కూడా ఇలాంటి కుట్రలు జరగలేదని ఆయన గుర్తు చేశారు. ఎంజీఆర్‌ సతీమణి జానకి అమ్మ పెద్ద మనసుతో పార్టీ నుంచి వైదొలగి జయలలితకు పార్టీ పగ్గాలు అప్పగించారని ఆయన తెలిపారు. అలాంటి చరిత్ర కలిగిన పార్టీని స్వలాభం కోసం ఉపయోగించుకోవాలన్న కుతంత్రంతో కుట్రకు తెరతీసినందునే దినకరన్ అరెస్టయ్యారని ఆయన చెప్పారు.

దీనిపై పీఎంకే నేత రాందాస్ మాట్లాడుతూ, అన్నాడీఎంకే (అమ్మ) బహిష్కృత నేత టీటీవీ దినకరన్ అరెస్ట్‌ సరైనదేనని అన్నారు. కేవలం అరెస్టుతో ఆపకుండా ప్రజాస్వామ్యాన్ని మంటగలిపే విధంగా వ్యవహరించిన అన్నాడీఎంకే గుర్తింపును, రెండాకుల చిహ్నాన్ని శాశ్వతంగా స్తంభింపచేయాలని ఆయన డిమాండ్ చేశారు. 

More Telugu News