: కొరియాకు చేరుకున్న అతి శక్తిమంతమైన అమెరికా థాడ్ మిస్సైళ్ల వ్యవస్థ.. తీవ్ర అలజడి

ఉత్త‌ర‌కొరియా దుందుడుకు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్న నేప‌థ్యంలో ఆ దేశాన్ని నియంత్రించేందుకు అమెరికా ప్ర‌య‌త్నాలు చేస్తోన్న విష‌యం తెలిసిందే. అయితే, ఉత్త‌ర‌కొరియా వెన‌క్కు త‌గ్గ‌కుండా ముందుకు వెళుతూ మ‌రిన్ని అణు ప‌రీక్ష‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న నేపథ్యంలో ఉత్త‌ర‌కొరియా దిశగా అమెరికా యుద్ధ‌నౌక‌లు క‌దులుతుండ‌డంతో యుద్ధమేఘాలు క‌మ్ముకుంటున్నాయి. ఇప్ప‌టికే అమెరికాకు చెందిన 'యూఎస్ఎస్ మిచిగ‌న్' యుద్ధ జ‌లాంత‌ర్గామి ద‌క్షిణ కొరియా తీరానికి చేరుకున్న విష‌యం తెలిసిం‌దే. అంతేగాక‌ ఉత్త‌ర‌కొరియా వైపున‌కు అమెరికాకు చెందిన‌ కార్ల్ విన్‌స‌న్ యుద్ధ నౌక‌ల టీమ్ కూడా బ‌య‌లుదేరింది. ఇదిలా ఉండ‌గా ఈ రోజు అమెరికాకు చెందిన వివాదాస్ప‌ద థాడ్ మిస్సైల్ వ్య‌వ‌స్థ ద‌క్షిణ కొరియా చేరుకుంది.

ఇది అత్యంత ప‌టిష్ట‌మైన వ్య‌వ‌స్థ కావ‌డంతో ఆందోళ‌న‌క‌ర ప‌రిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ మిసైల్ వ్య‌వ‌స్థ‌కు సంబంధించిన వాహ‌నాలు సియోల్‌కు ద‌క్షిణంగా డిఫెన్స్ వాహ‌నాల్లో 250 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న ప్రాంతానికి చేరుకున్నాయి. అమెరికా థాడ్ క్షిప‌ణులను త‌మ దేశానికి తీసుకురావ‌డాన్ని స్థానిక దక్షిణ‌ కొరియా ప్ర‌జ‌లు కూడా వ్య‌తిరేకించారు. అయితే, భారీ బందోబ‌స్తు మ‌ధ్య ఈ వాహ‌నాల‌ను తీసుకొచ్చారు. ఈ సంద‌ర్భంగా ఆందోళ‌న‌కారుల‌కు, పోలీసుల‌కు మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చెల‌రేగి ప‌దిమంది స్థానికుల‌కు గాయాల‌య్యాయి. మ‌రోవైపు ఇప్ప‌టికే ఈ అంశంపై స్పందించిన చైనా.. థాడ్ మిస్సైళ్ల వ‌ల్ల కొరియా ప్రాంతంలో భ‌ద్ర‌త బ‌ల‌హీన‌మ‌వుతుంద‌ని వ్యాఖ్యానించింది. స్వ‌ల్ప‌, మ‌ధ్య శ్రేణి క్షిప‌ణుల‌ను మొద‌టి ద‌శ‌లోనే ధ్వంసం చేసే శ‌క్తి అమెరికా థాడ్ మిసైల్ వ్య‌వ‌స్థకు ఉంది.

More Telugu News