: సుక్మా ఘటన వెనుక మాస్టర్ మైండ్.. ఇరవై నాలుగేళ్ల మావోయిస్టు కమాండర్ హిద్మా?

ఛత్తీస్ గడ్ లోని సుక్మా జిల్లాలో రెండు రోజుల క్రితం మావోయిస్టుల ఘాతుకానికి 25 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు బలైపోయిన విషయం తెలిసిందే. సుమారు మూడు వందల మంది మావోయిస్టులు ఈ మెరుపు దాడికి పాల్పడినట్టు బాధిత సీఆర్పీఎఫ్ జవాన్ ఒకరు చెప్పడం విదితమే. అయితే, ఇంత పకడ్బందీగా వ్యూహ రచన చేసి, దానిని అమలు చేసిన ‘మాస్టర్ మైండ్’ ఎవరనే విషయమై పోలీసులు ఆరా తీయగా పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ఈ వ్యూహ రచన చేసింది, అమలు పరిచింది కరుడుగట్టిన మావోయిస్టు కమాండర్ మద్వి హిద్మా అని, అతని వయసు ఇరవై నాలుగు సంవత్సరాలు అని తెలుస్తోంది. మద్వి హిద్మా గురించి చెప్పాలంటే..

* హిద్మా స్వస్థలం దక్షిణ సుక్మా జిల్లాలోని పుర్వతి గ్రామం.
* ఇతనిని హిద్మల్, సంతోష్ గా పిలుస్తుంటారు.
* సీపీఐ (మావోయిస్టు) మొదటి మిలిటరీ బెటాలియన్ కు మద్వి హిద్మా నేతృత్వం వహిస్తున్నారు.
* బస్రత్ లోని కరుడు గట్టిన మావోయిస్టులలో హిద్మా కూడా ఒకరు !.
* దక్షిణ సుక్మా, దంతెవాడ, బీజాపూర్ ప్రాంతాల్లో కార్యకలాపాలకు హిద్మా నేతృత్వం వహిస్తున్నారు.
* బక్క పలచని హిద్మా మచ్చలేని రెబల్ లీడర్ గా గుర్తింపు పొందాడు.
* తన ప్రాంతంలోని ఇన్ ఫార్మర్లతో నెట్ వర్క్ వ్యవహారాలు నడపడంలో హిద్మా దిట్ట.
* స్థానిక ఏరియా కమాండర్లను, సంఘం సదస్యాస్ (సంస్థ సభ్యులు)ను సమన్వయ పరిచే హిద్మాను ‘దేవుడి’తో సమానంగా    భావిస్తుంటారు.
* దళంలోకి కొత్తగా రిక్రూట్ అయిన యువకులకు హిద్మా రోల్ మోడల్.
* ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన  మీడియాకు చిక్కరు. రిపోర్టర్లను దూరంగా ఉంచుతారు.
* హిద్మాకు పహారా కాసే అంతరంగికుల్లో చాలా మంది ఆయన చిన్ననాటి స్నేహితులు.. సాయుధులైన యువకులే!

More Telugu News