: అమెరికా మహిళకు జైలు శిక్ష విధించిన చైనా

అమెరికాకు చెందిన ఓ మహిళా వ్యాపారవేత్తకు చైనా కోర్టు మూడున్నరేళ్ల జైలు శిక్షను విధించింది. తమ దేశానికి వ్యతిరేకంగా ఆమె గూఢచర్యానికి పాల్పడిందంటూ కోర్టు వ్యాఖ్యానించింది. వివరాల్లోకి వెళ్తే, హ్యూస్టన్ సిటీకి చెందిన సాండీ ఫాన్ గిల్లీన్ అనే మహిళ 2015 మార్చిలో టెక్సస్ కు చెందిన అధికారులతో కలసి వ్యాపార నిమిత్తం చైనా పర్యటనకు వచ్చింది. ఆమె గూఢచర్యానికి పాల్పడుతోందంటూ పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి తమ కస్టడీలో పెట్టుకున్నారు.

కోర్టు విచారణలో ఆమె నేరాన్ని అంగీకరించారని ఆమె తరపు లాయర్ తెలిపారు. అయితే ఆమె భర్త మాట్లాడుతూ, తన భార్య చాలా మంచిదని, ఆమెను అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్నారు. 1990లలో చైనాలో సాండీ గూంఢచర్యానికి పాల్పడిందంటూ ఆ దేశం చెబుతుండగా... ఆ సమయంలో ఆమె అమెరికాలో ఉందంటూ ఆమె భర్త ఆధారాలు చూపుతున్నారు. 

More Telugu News