: 'మా అమ్మను అమ్మేశారు...కాపాడండి' అంటూ కంచన్ బాగ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి

ఆర్థిక సమస్యలతో సతమతమయ్యే కంటే ఎక్కడో ఒక చోట ఉద్యోగం చేసి కుటుంబాన్ని గట్టెక్కించాలని భావించిన ఒక మహిళ నరకం చూస్తున్న ఘటన సౌదీ అరేబియాలో చోటుచేసుకుంది. ఈ ఘటన పూర్వాపరాల్లోకి వెళ్తే... హైదరాబాదులోని చంపాపేట్ పరిధిలోని హఫీజ్ బాబానగర్ కు చెందిన సల్మా బేగం (39) తన కుటుంబాన్ని ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కించాలని భావించి, సౌదీలో నర్సుగా పని ఉంటే చూడాలని బండ్లగూడకు చెందిన దళారులు అక్రమ్, షఫీలను ఆశ్రయించింది. ఆ దుర్మార్గులిద్దరూ అక్కడి మధ్యవర్తితో మాట్లాడి 3 లక్షలకు బేరం కుదుర్చుకుని ఆమెను సౌదీ అరేబియా పంపారు. అయితే అక్కడకి వెళ్లిన ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. తనను వివాహం చేసుకోవాలని ఆ యజమాని ఆమెను వేధింపులకు గురి చేశాడు.

ఆమె ససేమిరా అనడంతో ఆమెను పనిమనిషిగా మార్చేశారు. ఆమెను కొనుగోలు చేశానన్న విషయం చెబుతూ, విశ్రాంతినివ్వకుండా శారీరక, మానసిక వేదనకు గురి చేశాడు. దీంతో ఆమె అనారోగ్యం బారిన పడింది. ఆ నరకాన్ని భరించలేక...హైదరాబాదులో ఉన్న తన కుమార్తె సమీనాకు ఆడియో మెసేజ్ పంపింది. దీంతో తన తల్లిని విక్రయించారని తెలుసుకుని అవాక్కైన సమీనా దళారుల వద్దకు వెళ్లి నిలదీసింది. ఫిబ్రవరి 20 వరకు సమయం ఇస్తే ఆమెను తీసుకొస్తామని దళారులు ఆమెను నమ్మబలికారు. గడువుదాటిపోయినా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో సమీనా కంచన్ బాగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. 

More Telugu News