: చంద్రబాబుతో ముగిసిన తెలంగాణ నేతల భేటీ.. పలు సూచనలు చేసిన బాబు

తెలంగాణ టీడీపీ నేతలు తమ అధినేత చంద్రబాబుతో ఈ రోజు భేటీ అయ్యారు. అమరావతిలో వీరి సమావేశం కాసేపటి క్రితం ముగిసింది. ఈ సమావేశం సందర్భంగా తెలంగాణ నేతలకు చంద్రబాబు పలు సూచనలు చేశారు. జిల్లాల వారీగా పార్టీ సభలు నిర్వహించాలని సూచించారు. మే 23, 24 తేదీల్లో మినీ మహానాడులు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మినీ మహానాడుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా తీర్మానాలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.


వీటికి తోడు ముందస్తు ఎన్నికలు, పొత్తులు తదితర అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది. మహానాడులో చర్చించాల్సిన అంశాల గురించి తెలంగాణ స్థాయిలో ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు. ప్రతినిధుల సమావేశానికి హాజరుకావాలంటూ టీటీడీపీ నేతలు ఈ సందర్భంగా చంద్రబాబును కోరారు. అంతేకాకుండా, బీజేపీ అనుసరిస్తున్న వైఖరి సరిగా లేదంటూ బాబుకు ఫిర్యాదు చేశారు. టీడీపీతో కొనసాగిస్తున్న స్నేహం విషయంలో ఏపీలో ఒక విధంగా, తెలంగాణలో మరో విధంగా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారని తెలిపారు. దీనికి సమాధానంగా చంద్రబాబు మాట్లాడుతూ, ఏ పార్టీకి ఆ పార్టీ బలపడాలనే ఉంటుందని... ఇవన్నీ సహజమేనని చెప్పారు. బీజేపీ నేతల వైఖరిపై ఆ పార్టీ అధిష్ఠానంతో మాట్లాడతానని తెలిపారు. ఈ సమావేశానికి రమణ, రేవంత్ రెడ్డిలతో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. 

More Telugu News