: 28న మాత్రం సెలవు పెట్టొద్దు... పలు కంపెనీల్లో ఆంక్షలు.. ఉద్యోగుల్లో 'బాహుబలి' ఫీవర్!

దేశవ్యాప్తంగా 'బాహుబలి-2' ఫీవర్ పెరిగిపోయిన వేళ, చిత్రం విడుదల రోజున సెలవు పెట్టి మరీ సినిమాకు వెళ్లాలని భావిస్తున్న వారి సంఖ్య అధికంగా ఉండటంతో, ఆ రోజున మాత్రం సెలవు పెట్టవద్దని పలు కంపెనీలు ఆంక్షలు పెడుతున్నట్టు తెలుస్తోంది. 'కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?' అన్న ప్రశ్నకు సమాధానాన్ని తొలుత తెలుసుకోవాలన్న ఉత్సాహం, తమ విధులకు సెలవు పెట్టేలా చేస్తోంది. ఇక ఆఫీసుల్లో రోజువారీ కార్యకలాపాలపై ప్రభావం పడుతుందన్న ఉద్దేశంతో, కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఇప్పటికే సెలవులపై ఆంక్షలు విధించాయి.

కాగా, ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోని 90 శాతం థియేటర్లను తాకనుండగా, తమకు ఇంకా టికెట్లు దొరకనే లేదని అత్యధికులు వాపోతున్నారు. ఆన్ లైన్లో టికెట్లను విడుదల చేయగానే క్షణాల వ్యవధిలో బ్రోకర్లు వాటిని బ్లాక్ చేసి అధిక ధరలకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇక ప్రీమియర్ షో టికెట్ల ధర ఏకంగా రూ. 2 వేల నుంచి రూ. 3 వేల వరకూ పలుకుతున్నట్టు తెలుస్తోంది. 10 శాతం టికెట్లను మాత్రమే ఆన్ లైన్లో విక్రయానికి ఉంచుతున్న థియేటర్ యాజమాన్యాలు, మిగతా టికెట్లను బ్లాక్ చేస్తున్నాయన్న ఆరోపణలూ పెరుగుతున్నాయి. టికెట్లు దొరకని వారు తమకు తెలిసిన రాజకీయ నాయకులు, పోలీసు అధికారుల సహాయాన్ని కోరుతున్న పరిస్థితి నెలకొంది.

More Telugu News